Begin typing your search above and press return to search.

'ది వారియర్' ట్రైలర్: పవర్ ఫుల్ పోలీసాఫీసర్ - క్రూరమైన విలన్ మధ్య జరిగే వార్..!

By:  Tupaki Desk   |   1 July 2022 3:17 PM GMT
ది వారియర్ ట్రైలర్: పవర్ ఫుల్ పోలీసాఫీసర్ - క్రూరమైన విలన్ మధ్య జరిగే వార్..!
X
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో, ఉస్తాద్ రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ''ది వారియర్''. తమిళ దర్శకుడు లింగుస్వామి తెరకెక్కించిన ఈ బైలింగ్విల్ లో రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు.

'ది వారియర్' సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్ మరియు పాటలు మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా థియేట్రికల్ ట్రైలర్ ను లాంచ్ చేశారు. ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేయగా.. కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ తమిళ్ ట్రైలర్ ను విడుదల చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

'ఒక చెట్టు మీద 40 పావురాలు ఉన్నాయి. దాంట్లో ఒక్క పావురాన్ని కాలిస్తే.. ఇంకా ఎన్ని ఉంటాయి? అన్నీ ఎగిరిపోతాయి..' అంటూ రామ్ రౌడీ మూకల్లో ఒకరిని షూట్ చేయడంతో ఈ ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఇందులో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా రామ్ అదరగొట్టాడు.

కర్నూల్ డీఎస్పీగా ఛార్జ్ తీసుకున్న రామ్.. ఒంటి మీద యూనిఫామ్ లేకపోయినా ఇరవై నాలుగు గంటలు డ్యూటీలో ఉంటానని హెచ్చరిస్తున్నాడు. హీరోయిన్ కృతి శెట్టి రేడియో జాకీగా అలరిస్తోంది. వర్సటైల్ యాక్టర్ ఆది పినిశెట్టి క్రూరమైన విలన్ గురు గా కనిపించాడు.

మనిషి అనేవాడు బలంతో బ్రతకాలి లేదా భయంతో బ్రతకాలి.. మర్డర్లు చేయడానికి నేను మతాలను చూడను అని రాయలసీమ స్లాంగ్ లో వార్నింగ్ ఇవ్వడంతో అతని పాత్రను పరిచయం చేసారు. పవర్ ఫుల్ పోలీసాఫీసర్ అయిన రామ్.. శక్తివంతమైన ప్రతినాయకుడు ఆది మధ్య వార్ నే 'ది వారియర్' సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఆది ఆగడాలకు రామ్ ఎలా అడ్డుకట్ట వేశారు? దీని కోసం ఎలాంటి ఆపరేషన్ చేశారు? వారి మధ్య వార్ ఎలా సాగింది? అతన్ని ఎలా అంతమొందించారు? అనేది తెలియాలంటే వారియర్ సినిమా చూడాల్సిందే.

మాస్ ఆడియన్స్ ని టార్గెట్ పెట్టుకొని హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా 'ది వారియర్ ' చిత్రాన్ని తీర్చిదిద్దినట్లు ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. యాక్షన్ సీక్వెన్స్ లు ఇందులో హైలైట్ గా నిలిచాయి. రామ్ చాలా స్టైలిష్ గా ఉన్నారు. అగ్రిసివ్ పోలీస్ గా ఆకట్టుకున్నాడు. విలన్ పాత్ర కూడా హీరోకి ధీటుగా డిజైన్ చేశారు లింగుస్వామి.

ట్రైలర్ గతంలో వచ్చిన పోలీస్ సినిమాలను గుర్తు చేసినా.. ఏదో కొత్తగా చెప్పబోతున్నారనే ఆసక్తిని కలిగింది. కృతి శెట్టికి డ్యాన్స్ లతో రామ్ తో పోటీ పడింది. అక్షర గౌడ - నదియా ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ బ్యాగ్రౌండ్ స్కోర్ మరియు సుజీత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.

పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు డి.వై. సత్యనారాయణ ఆర్ట్ డైరక్టర్ గా వర్క్ చేయగా.. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాసిన ఈ సినిమాకి అన్బు అరివ్ యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు.

'ది వారియర్' చిత్రాన్ని 2022 జూలై 14న తెలుగు తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఇది రామ్ కు ఫస్ట్ తమిళ్ మూవీ. మరి ఈ మాస్ అండ్ యాక్షన్ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.