Begin typing your search above and press return to search.

కృతి అందాన్ని చూస్తే రామ్ గుండెల్లో దడ దడే.!

By:  Tupaki Desk   |   4 Jun 2022 8:23 AM GMT
కృతి అందాన్ని చూస్తే రామ్ గుండెల్లో దడ దడే.!
X
ఎనర్జిటిక్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''ది వారియర్''. తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ బైలింగ్విల్ లో రామ్ ఒక పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఇందులో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ కు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. 'ది వారియర్' నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు మరియు టీజర్ లు ప్రేక్షకులను అలరించాయి. అలానే కోలీవుడ్ హీరో శింబు పాడిన 'బుల్లెట్' సాంగ్ విశేష స్పందన తెచ్చుకుంది.

ఈ నేపథ్యంలో 'వారియర్' సినిమా నుండి తాజాగా 'దడ దడ' అనే సెకండ్ సింగిల్ ని విలక్షణ దర్శకుడు గౌతమ్ మీనన్ రిలీజ్ చేశారు. 'దడ దడమని హృదయం శబ్దం.. నువ్వు ఇటుగా వస్తావని అర్థం.. బడబడమని వెన్నెల వర్షం.. నువ్వు ఇక్కడే ఉన్నావని అర్థం' అంటూ సాగిన ఈ మెలోడీ శ్రోతలను అలరిస్తోంది.

కృతి ప్రేమలో మునిగి తేలుతున్న రామ్.. తన ఫీలింగ్స్ ని ఈ పాట ద్వారా వివరిస్తున్నారు. తొలిసారిగా కలిసి నటిస్తున్న రామ్ - కృతి జంట స్క్రీన్ పై అందగా కనిపిస్తోంది. అగ్ర దర్శకుడు శంకర్ ఈ సాంగ్ షూటింగ్ టైంలోనే సెట్స్ కు వెళ్లినట్లు తెలుస్తోంది.

ప్రతి సినిమాలో ఒక్కటైనా బ్యూటీఫుల్ మెలోడీకి అందించే రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్.. ఇప్పుడు 'దడ దడ' పాటకు స్వరాలు సమకూర్చారు. శ్రీమణి సాహిత్యం అందించగా.. సింగర్ హరి చరణ్ ఈ గీతాన్ని ఆలపించారు. సుజీత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేశారు.

'ది వారియర్' చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో ఆది పినిశెట్టి పవర్ ఫుల్ విలన్ రోల్ లో కనిపించనుండగా.. అక్షర గౌడ కీలక పాత్ర పోషించింది. నదియా - నాజర్ ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటించారు.

'ది వారియర్' రామ్ కు కోలీవుడ్ డెబ్యూ మూవీ. 2022 జూలై 14న తెలుగు తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతోంది.