Begin typing your search above and press return to search.

అడ్ర‌స్ లేని నిర్మాత మ‌ళ్లొచ్చాడు

By:  Tupaki Desk   |   5 July 2021 2:52 AM GMT
అడ్ర‌స్ లేని నిర్మాత మ‌ళ్లొచ్చాడు
X
అభిషేక్ నామా.. ఒక స‌మ‌యంలో క్రేజీ చిత్రాల‌తో టాలీవుడ్లో చిన్న పాటి ప్ర‌కంప‌న‌లు రేపిన నిర్మాత‌. నైజాం ఏరియాలో తిరుగులేకుండా సాగిపోతున్న దిల్ రాజుకు చెక్ పెడుతూ వ‌రుస‌గా పెద్ద సినిమాలను భారీ రేట్ల‌కు కొని నైజాం ఏరియాలో రిలీజ్ చేయ‌డం ద్వారా త‌న ఉనికిని చాటుకున్న అభిషేక్.. త‌ర్వాత నిర్మాణంలోకి కూడా అడుగు పెట్టాడు. బాబు బాగా బిజీ, కేశ‌వ‌, సాక్ష్యం, గూఢ‌చారి సినిమాల‌ను నిర్మించాడు. ఇంకా పెద్ద స్థాయిలో వ‌రుస‌గా సినిమాలు చేయ‌బోతున్న‌ట్లు సంకేతాలు ఇచ్చిన అభిషేక్.. ఉన్న‌ట్లుండి అడ్ర‌స్ లేకుండా పోయాడు. సాక్ష్యం సినిమాతో అభిషేక్‌కు గ‌ట్టి దెబ్బే త‌గిలింది. దీని త‌ర్వాత గూఢ‌చారి మంచి ఫ‌లితాన్నే అందించినా సాక్ష్యం కొట్టిన దెబ్బ నుంచి ఆయ‌న కోలుకోలేక‌పోయాడు. సినిమాల నిర్మాణమే ఆపేశాడు.

డిస్ట్రిబ్యూష‌న్లోనూ దూకుడు త‌గ్గింది. ఆయ‌న స్థానాన్ని వ‌రంగ‌ల్ శీను భ‌ర్తీ చేశాడు.

అభిషేక్ పిక్చ‌ర్స్ నుంచి ఇక సినిమాల నిర్మాణ‌మే ఉండ‌ద‌నే అంతా అనుకున్నారు. ఐతే అభిషేక్ పేరు అంతా మ‌రిచిపోతున్న స‌మ‌యంలో ఓ ఆస‌క్తిక‌ర సినిమాతో రీఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడాయ‌న‌. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా ఓ వైవిధ్య‌మైన సినిమాను నిర్మిస్తున్నాడు అభిషేక్. ఆదివారం ఈ చిత్ర ప్రి లుక్ రిలీజ్ చేశారు. పాత కాలం నాటి నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న పీరియ‌డ్ మూవీ ఇద‌ని ప్రి లుక్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. ప్రి లుక్‌లో అభిషేక్ పేరు త‌ప్ప ఇంకేవీ క‌నిపించ‌లేదు.

ఇంత‌కుముందు అభిషేక్ నిర్మాణంలో బాబు బాగా బిజీ చిత్రాన్ని రూపొందించిన న‌వీన్ మేడారంయే ఈ చిత్రాన్ని రూపొందిస్తున్న‌ట్లు స‌మాచారం. పెద్ద బ‌డ్జెట్లోనే ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నార‌ట‌. క‌ళ్యాణ్ రామ్ పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని సోమ‌వారం ఈ చిత్ర టైటిల్, ఫ‌స్ట్ లుక్ లాంచ్ చేయ‌బోతున్నారు. ఈ సినిమా ఫలితాన్ని బ‌ట్టి అభిషేక్ మ‌రిన్ని సినిమాల‌ను లైన్లో పెట్ట‌నున్నాడ‌ట‌.