Begin typing your search above and press return to search.

రీమేక్ రైట్స్ లో మెగాత్ర‌యం `చిరు-ప‌వ‌న్-చ‌ర‌ణ్` హ‌వా

By:  Tupaki Desk   |   12 Aug 2021 12:39 PM IST
రీమేక్ రైట్స్ లో మెగాత్ర‌యం `చిరు-ప‌వ‌న్-చ‌ర‌ణ్` హ‌వా
X
తెలుగు సినిమా అనువాదాల‌కు రీమేక్ ల‌కు ఇరుగు పొరుగున‌ విప‌రీత‌మైన గిరాకీ ఉంది. బాలీవుడ్ లోనూ తెలుగు చిత్రాలు రీమేక్ ల హ‌వా ఓ రేంజులో ఉంది. శాటిలైట్ డిజిట‌ల్ స‌హా డ‌బ్బింగ్ రైట్స్ కి భారీ డిమాండ్ నెల‌కొంది. ఇటీవలి తెలుగు కంటెంట్ కి వెయిట్ ఉత్త‌రాదిన అమాంతం పెరిగింది. ముఖ్యంగా టాలీవుడ్ బ్లాక్ బ్ల‌స్ట‌ర్లు హిందీలో రీమేక్ అయ్యి కోట్లు కొల్ల‌గోడుతున్నాయి. అడ‌ప‌ద‌డ‌పా తెలుగు స్టార్లు బాలీవుడ్ చిత్రాల్లో న‌టించ‌డం కూడా ఆ సినిమాకి క‌లిసొచ్చే అంశంగా మారుతోంది. తెలుగు నిర్మాత‌లే హిందీలో రీమేక్ చేస్తూ అక్క‌డా స‌త్తా చాటుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కుతున్న `ఆచార్య` సినిమాకు హిందీ డ‌బ్బింగ్ రైట్స్ రూపంలో భారీ ధ‌ర‌ ప‌లికింది.

ఏకంగా 26 కోట్ల‌కు ప్ర‌ముఖ‌ పంపిణీ సంస్థ డ‌బ్బింగ్ హ‌క్కుల్ని చేజిక్కించుకుంది. ఇప్ప‌టివ‌ర‌కూ అత్య‌ధిక ధ‌ర‌ ప‌వ‌న్ క‌ల్యాణ్-రానా సినిమా అయ్య‌ప్ప‌నుమ్ కోషియం రీమేక్ కి ప‌లిచింది. ఈ చిత్రం 23 కోట్ల‌కు అమ్ముడు పోయింది. ఇప్పుడా రికార్డును `ఆచార్య` బ్రేక్ చేసి స‌రికొత్త చ‌రిత్ర‌ను సృష్టించింది. మ‌రి ఆచార్యకు ఇంత క్రేజ్ దేనికి అంటే.. మెగాస్టార్ `సైరా` లాంటి పాన్ ఇండియా చిత్రంలో న‌టించాక రిలీజ‌వుతున్న చిత్రంగా ఇంత‌టి క్రేజును తెచ్చుకుంది. అలాగే అప‌జ‌య‌మెరుగ‌ని కొర‌టాల‌తో మెగాస్టార్ కాంబినేష‌న్ కూడా ఒక కార‌ణం. గ‌తంలో కొర‌టాల తెర‌కెక్కించిన శ్రీమంతుడు చిత్రాన్ని స‌ల్మాన్ ఖాన్ రీమేక్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. కొర‌టాల ఇత‌ర సినిమాల‌కు ఇరుగు పొరుగు భాష‌ల్లో గొప్ప డిమాండ్ నెల‌కొంది. ఇది కూడా డ‌బ్బింగ్ రైట్స్ కి హైప్ పెంచుతోంది.

అలాగే `జ‌న‌తా గ్యారేజ్`.. `భ‌ర‌త్ అనే నేను `లాంటి చిత్రాలు హిందీ బుల్లి తెర‌ను అనువాదాల‌ రూపంలో ఏలాయి. కొర‌టాల క‌థ‌ల‌కు ఆ ర‌కంగా హిందీలో మంచి డిమాండ్ ఏర్ప‌డింది. తాజాగా `ఆచార్య‌`లో మెగాస్టార్ స‌హా చ‌ర‌ణ్ ఇమేజ్ కూడా తోడ‌వ్వ‌డంతో సినిమా భారీ ధ‌ర ప‌లికిన‌ట్లు తెలుస్తోంది. ఇక ఆచార్య మ‌ల్టీస్టార‌ర్ కేట‌గిరీ. `ఆచార్య‌`లో సిద్ధ‌ అనే కీల‌క పాత్ర‌లోనూ చ‌ర‌ణ్ 40నిమిషాల పాటు క‌నిపిస్తారు. `జంజీర్` రీమేక్ తో చ‌ర‌ణ్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. `ఆచార్య‌`ని కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్- మ్యాట్ని ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రామ్ చ‌ర‌ణ్ కీల‌క నిర్మాత కావ‌డంతో ఈ వ్య‌వ‌హారం మొత్తం ఆయ‌నే డీల్ చేసిన‌ట్లు తెలిసింది.

గ‌త రికార్డుల‌ను ప‌రిశీలిస్తే..!

టాలీవుడ్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల‌తో హిందీ మార్కెట్ ని కొల్ల‌గొట్టే స్థాయికి ఎదిగింది. హిందీ డ‌బ్బింగుల్లో గ‌త‌ రికార్డుల్ని ప‌రిశీలిస్తే... మహేష్ - పైడిప‌ల్లి కాంబినేష‌న్ లో వ‌చ్చిన `మహర్షి` హిందీ డబ్బింగ్ హక్కులు 20 కోట్లకు వెళ్లాయంటే అర్థం చేసుకోవాలి. సూప‌ర్ స్టార్ మ‌హేష్ - అనీల్ రావిపూడి మూవీ సరిలేరు నీకెవ్వరు డ‌బ్బింగ్ హ‌క్కులు 15.2 కోట్లకు అమ్ముడయ్యాయి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన `అల వైకుంఠపురములో` కోసం 19 కోట్లు చెల్లించ‌గా... యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన `అరవింద సమేత`కు హిందీ వాళ్లు 18 కోట్లకు అనువాద హ‌క్కులు కొన్నారు.

రామ్ చరణ్- మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్ లో వ‌చ్చిన డిజాస్ట‌ర్ చిత్రం `వినయ విధేయ రామ` హిందీ డబ్బింగ్ హక్కులు రూ. 22 కోట్లు అందుకోవ‌డం షాక్. విన‌య విధేయ రామ ఇక్క‌డ‌ ఎంత డిజాస్ట‌ర్ అయినా హిందీలో ఆ రేంజుకు వెళ్ల‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఇప్ప‌టివ‌ర‌కూ టాలీవుడ్ బెస్ట్ ఇదేన‌న్న టాక్ కూడా వినిపించింది. మ‌ళ్లీ ఆ రేంజును మించి హిందీ డ‌బ్బింగ్ హ‌క్కుల కోసం ప‌వ‌న్ - రానా మూవీకి ఏకంగా 23కోట్లు చెల్లిస్తున్నార‌ని తెలిసింది. ప్ర‌స్తుతం ఈ మూవీ ఇంకా షూటింగ్ ద‌శ‌లో ఉండ‌గానే ఇంత భారీ ధ‌ర ప‌లికింది. ఈ చిత్రం 2022 సంక్రాంతికి విడుదల కానుంది. ఇక ప‌వ‌న్ రికార్డునే కొట్టేస్తూ మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ఆచార్య రికార్డ్ స్థాయి ధ‌ర‌కు హిందీ డ‌బ్బింగ్ రైట్స్ ని ఛేజిక్కించుకోవ‌డం మ‌రో బిగ్ స‌ర్ ప్రైజ్ అనే చెప్పాలి.