Begin typing your search above and press return to search.

'నాయట్టు' రీమేక్ అందుకే ఆగిపోయిందట

By:  Tupaki Desk   |   4 Jan 2022 3:40 AM GMT
నాయట్టు రీమేక్ అందుకే ఆగిపోయిందట
X
మొదటి నుంచి కూడా మలయాళ ప్రేక్షకులు కథలో సహజత్వానికి అధిక ప్రాధాన్యతను ఇస్తుంటారు. ఖర్చుపై కాకుండా కథపై మాత్రమే వాళ్లు ఎక్కువగా దృష్టి పెడుతుంటారు. ఒక చిన్న పాయింటును పట్టుకుని దాని చుట్టూ ఆసక్తికరమైన కథను అల్లడం అక్కడి దర్శకుల ప్రత్యేకతగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ మధ్య కాలంలో తెలుగు ప్రేక్షకులు కూడా మలయాళ కథల పట్ల ఎక్కువ ఆసక్తిని చూపుతున్నారు. అందువల్లనే అక్కడి కథలను రీమేక్ చేయడానికి ఇక్కడి మేకర్స్ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. అలా చాలా రీమేకులు ఇప్పుడు ఇక్కడి సెట్స్ పై ఉన్నాయి.

అలా తెలుగులో రీమేక్ కావడానికి వచ్చిన సినిమాలలో 'నాయట్టు' ఒకటి. మార్టిన్ ప్రకట్ దర్శకత్వం వహించిన ఈ సినిమా క్రితం ఏడాది ఏప్రిల్లో అక్కడ విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ముగ్గురు పోలీసులు ఒక హత్యానేరంలో చిక్కుకుంటారు. దాంతో వాళ్లని మరికొంతమంది పోలీసులు వెంటాడుతూ ఉంటారు. పోలీసుల బారి నుంచి పోలీసులే తప్పుంచుకునే కొత్తదనంతో కూడిన కథ ఇది. కథలో భారీతనం .. హడావిడి ఎక్కడా కనిపించదు. చాలా సహజంగా ఆసక్తికరమైన మలుపులు తీసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటుంది.

ఈ కథ డబ్బింగ్ .. రీమేక్ హక్కులను గీతా ఆర్ట్స్ వారు దక్కించుకున్నారు. తెలుగులో ఈ సినిమాను రీమేక్ చేయడానికి రంగంలోకి దిగారు. రావు రమేశ్ .. అంజలి .. ప్రియదర్శి ప్రధాన పాత్రలుగా అనుకున్నారు. పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. 'పలాస' దర్శకుడు కరుణ కుమార్ కి దర్శకత్వ బాద్యతలను అప్పగించారు. అయితే ఆ తరువాత ఈ ప్రాజెక్టును ఆపేసినట్టుగా వార్తలు వచ్చాయి. ఎందుకు ఆగిపోయిందనేది ఎవరికీ తెలియదు. తాజాగా ఆ విషయం బయటికి వచ్చింది. బడ్జెట్ కారణంగానే ఈ ప్రాజెక్టు ఆగిపోయిందట.

మూల కథ చూస్తే కథా పరిధి తక్కువ .. పాత్రలు కూడా చాలా తక్కువ. పోలీసులు తప్పించుకునే ప్రయత్నంలో లొకేషన్స్ మారడమే ఖర్చుగా కనిపిస్తుందంతే. అందువలన ఈ సినిమాను 4 కోట్లలో పూర్తి చేయాలని గీతా ఆర్ట్స్ వారు భావించారట. అయితే ఆర్టిస్టుల పారితోషికాలు .. ఇతర ఖర్చులన్నీ కలుపుకుంటే 8 కోట్ల వరకూ అవుతోందట. అందువలన రీమేక్ ఆలోచనను విరమించుకున్నారని అంటున్నారు. త్వరలో డబ్ చేసి 'ఆహా'లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు. ఇక ఆల్రెడీ కరుణ కుమార్ కి అడ్వాన్స్ ఇవ్వడం వలన, ఆయనతో మరో ప్రాజెక్టును ప్లాన్ చేస్తున్నారని వినికిడి.