Begin typing your search above and press return to search.

అసలు సిసలైన సినిమా పండుగ ఇప్పటి నుంచే మొదలు..!

By:  Tupaki Desk   |   1 April 2021 11:38 PM IST
అసలు సిసలైన సినిమా పండుగ ఇప్పటి నుంచే మొదలు..!
X
కరోనా సంక్షోభం తర్వాత టాలీవుడ్‌ లో సినిమాల విడుదలలు ఊపందుకొన్నాయి. థియేటర్లు ఓపెన్ అయిన తర్వాత ప్రేక్షకులు థియేటర్లకు రావడం మొదలు పెట్టడంతో ఫిలిం మేకర్స్ అందరూ తమ సినిమాలను రిలీజ్ చేయడానికి పోటీ పడుతున్నారు. జనవరి నుంచి వారానికి మూడు నాలుగు కొత్త సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఈ మూడు నెలల్లో కొన్ని సినిమాలు సూపర్ హిట్ అవ్వగా.. మరికొన్ని సినిమాలు యావరేజ్ గా ఇంకొన్ని ప్లాపులుగా మిగిలిపోయాయి. అయితే ఇప్పటి వరకు విడుదలైన వాటిలో భారీ చిత్రాలు ఏవీ లేవని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ నెలలో హాట్ సమ్మర్ లో అసలు సిసలైన సినిమా పండుగ మొదలు కాబోతోంది.

'కింగ్' అక్కినేని నాగార్జున నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ''వైల్డ్ డాగ్'' రేపు (ఏప్రిల్ 2) శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాల సందడి దీనితోనే మొదలు కానుంది. హైదరాబాద్ లో గతంలో జరిగిన టెర్రరిస్ట్ దాడుల ఇతివృత్తంతో ఈ చిత్రం తెరకెక్కింది. అహిషోర్ సాల్మన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి - అన్వేష్ రెడ్డి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ - ట్రైలర్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. నాగార్జున అన్నీ తానై ప్రమోషన్స్ చూసుకుంటున్న ఈ సినిమాపై బజ్ ఏర్పడింది. న్యూ ఏజ్ కమర్షియల్ సినిమాగా చెప్తూ వస్తున్న 'వైల్డ్ డాగ్' ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. దీనికి తోడుగా కోలీవుడ్ హీరో కార్తీ - రష్మిక మందన్న జంటగా నటించిన 'సుల్తాన్' సినిమా కూడా రేపే రిలీజ్ కానుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' సినిమా ఏప్రిల్ 9న రిలీజ్ కి రెడీ అయింది. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు - బోనీ కపూర్ కలిసి నిర్మిస్తున్నారు. పవన్ చాలా గ్యాప్ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై కనిపించే చిత్రం కావడంతో పీకే ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వచ్చిన సాంగ్స్ - ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసాయి. 'పింక్' రీమేక్ అయినప్పటికీ అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ సినిమా కాబట్టి టాక్ ఎలా ఉన్నా భారీ ఓపెనింగ్స్ కి డోకాలేదు. మరి ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ అవుతుందో చూడాలి.

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య - సాయి పల్లవి జంటగా నటించిన 'లవ్ స్టొరీ' సినిమా ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ - అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ మరియు పాటలు విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 'ఫిదా' సినిమా తర్వాత శేఖర్ కమ్ముల నుంచి వస్తున్న ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ పై మంచి అంచనాలు ఉన్నాయి.

నేచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ రూపొందుదిస్తున్న 'టక్ జగదీష్' సినిమా ఏప్రిల్ 23న విడుదల కానుంది. షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌ పై సాహు గార‌పాటి - హ‌రీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రమోషన్ కార్యక్రమాలతో టక్ జగదీష్ మంత్ గా మార్చేసిన మేకర్స్ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నాని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక అదే రోజు 'టక్ జగదీష్' కు పోటీగా బాలీవుడ్ క్వీన్ నటించిన 'తలైవి' సినిమా రానుంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా ఎ.ఎల్. విజయ్ ఈ చిత్రానికి తెరకెక్కించాడు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ మంచి స్పందన తెచ్చుకుంది.

దగ్గుబాటి రానా - సాయి పల్లవి జంటగా నటిస్తున్న 'విరాటపర్వం' చిత్రాన్ని ఏప్రిల్ 30న రిలీజ్ చేయనున్నారు. వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ - శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్స్ నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ - సాంగ్స్ సినిమాపై అంచనాలు కలిగించాయి. 'నీది నాది ఒకటే కథ' తర్వాత వేణు ఊడుగుల నుంచి వస్తున్న ఈ వైవిధ్యమైన సినిమా ఎలా ఉంటుందో అనే ఆసక్తి జనాల్లో ఉంది. ఈ సినిమాలతో పాటు చిన్నా చితకా డబ్బింగ్ సినిమాలు కలుపుకుని సుమారు 20 చిత్రాలు ఏప్రిల్ లో రిలీజ్ కానున్నాయి. మళ్ళీ కోవిడ్ కేసులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో టాలీవుడ్ కు ఈ నెల క్రూసియల్ అని చెప్పవచ్చు.