Begin typing your search above and press return to search.

కన్నడ సీమకు రాజకుమారుడే...

By:  Tupaki Desk   |   29 Oct 2021 1:30 PM GMT
కన్నడ సీమకు రాజకుమారుడే...
X
కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం భారతీయ సినిమా ప్రపంచాన్ని దిగ్రాంతిని గురి చేసింది. వయసు నలభై ఆరు. ఇంకా ఎంతో వ్యూచర్ ఉంది. ఆయన జోరూ తీరూ చూస్తే కచ్చితంగా కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ పేరుని రెట్టింపు చేయగల సమర్ధుడు. అలాంటి పునీత్ హార్ట్ అటాక్ తో కన్నుమూయడం సినీ ప్రేమికులతో పాటు అందరినీ కంట నీరు పెట్టించేదే.

ఏ కోణంలో చూసినా ఎవరూ ఆయనలో ఏ వంక పెట్టలేరు. వినయం ఆయనకున్న అతి పెద్ద సంపద. నిత్య విద్యార్ధి. నటన అంటే ఇంట్లోనూ ఒంట్లోనూ ఉంది. అందుకే కేవలం అయిదేళ్ల వయసులోనే బాల నటుడుగా తెరంగేట్రం చేసి శభాష్ అనిపించుకున్నాడు. బాల నటుడిగా ఎన్నో పురస్కారాలతో పాటు జాతీయ అవార్డులను కూడా కొల్లగొట్టాడు. ఇక సోలో హీరోగా కూడా మూడు పదులు దాటి సినిమాలు చేశాడు. బ్లాక్ బస్టర్లు అందులో ఎన్నో ఉన్నాయి.

హీరోగా కన్నడ సినిమాను రాష్ట్రం హద్దులు దాటించాడు. ఆయనకు టాలీవుడ్ తో సహా అన్ని భాషల పరిశ్రమలతో మంచి పరిచయాలు ఉన్నాయి. ఇక కన్నడ సినిమాను పాన్ ఇండియా లెవెల్ కి తీసుకెళ్ళగల సత్తా ఉన్న‌ స్టార్ ఆయన. కేజీఎఫ్ తో ఈ మధ్యనే కన్నడ సీమ యావత్తు భారతీయ సినీ ప్రపంచాన్ని తన వైపునకు తిప్పుకుంది. రానున్న రోజుల్లో తన చుట్టూ దేశీయ సినిమా తిరిగేలా చేసే కెపాసిటీని కూడా శాండిల్ వుడ్ సంపాదిస్తోంది.

ఈ నేపధ్యంలో పునీత్ రాజ్ కుమార్ అవసరం చాలా ఉంది.ఆయన అద్భుతమైన స్టార్. పక్కా మాస్ హీరో. కలెక్షన్ల సునామీని క్రియేట్ చేయగల హీరోచిత లక్షణాలు నిండా ఉన్నవాడు. ఇక కరోనా అనంతరం భారతీయ చిత్ర సీమ అతి పెద్ద స్లంప్ లో చిక్కుకుంది. ఇలాంటి టైమ్ లో మళ్లీ సినీ రంగాన్ని గాడిని పెట్టగల సత్తా ఉన్న వివిధ ప్రాంతీయ భాషల హీరోలలో పునీత్ సైతం అగ్రభాగాన ఉన్నాడు. అలాంటి హీరో అకస్మాత్తుగా అదృశ్యం కావడం అంటే బాధాకరమే.

ఇక వ్యక్తిగతంగా చూస్తే మంచి అలవాట్లు ఆయన సొంతం, హీరో అన్న గర్వం లేదు. ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధాసక్తులు ఉన్నాయి. డైట్ విషయంలో పూర్తి కంట్రోల్ లో ఉంటాడని చెబుతారు. ఇక వ్యాయామానికి పెద్ద పీట వేస్తూ నిత్యం స్మార్ట్ గా ఉండే పునీత్ అదే జిమ్ లో ఎక్సర్ సైజు చేస్తూ గుండె పోటుతో మృతి చెందడం అంటే అంతకంటే దారుణం ఉండదేమో. విధి బలీయమైనది అని మాత్రమే ఈ సందర్భంగా అంతా అనుకోవాలి మరి.