Begin typing your search above and press return to search.

టీజర్: ఇంటెన్స్ ఎమోషనల్ డ్రామాగా 'ది లైఫ్ ఆఫ్ ముత్తు'..!

By:  Tupaki Desk   |   10 Sep 2022 2:24 PM GMT
టీజర్: ఇంటెన్స్ ఎమోషనల్ డ్రామాగా ది లైఫ్ ఆఫ్ ముత్తు..!
X
తమిళ హీరో శింబు మరియు స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కాంబినేషన్‌ లో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ ‘వెందు తానిందతు కాదు’. శ్రీ స్రవంతి మూవీస్ సంస్థ తెలుగులో ''ది లైఫ్ ఆఫ్ ముత్తు'' అనే పేరుతో విడుదల చేస్తోంది.

ఇందులో శింబు సరసన సిద్ధి ఇద్నాని హీరోయిన్ గా నటించగా.. సీనియర్ నటి రాధిక కీలక పాత్ర పోషించారు. రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

ఇటీవల లాంచ్ చేసిన 'ది లైఫ్ ఆఫ్ ముత్తు' టైటిల్ పోస్టర్ మరియు శింబు ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా టీజర్ ను చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా ఆవిష్కరించారు.

ఈ టీజర్ మొత్తం ఏఆర్ రెహమాన్ పాడిన పాట నేపథ్యంలో హీరో లైఫ్ జర్నీని చూపిస్తుంది. ఇది వలస కార్మికుడి కష్టాల నేపథ్యంలో రూపొందిన యాక్షన్ డ్రామాని సూచిస్తోంది. ఇందులో మనం ముత్తు ప్రయాణం ఎక్కడ మొదలై ఎక్కడి వరకూ సాగిందనేది చూడొచ్చు.

పల్లెటూరి యువకుడిగా కనిపించిన శింబు.. తన కుటుంబాన్ని పోషించడానికి కూలి పనులు చేస్తున్నాడు. అతని తల్లిగా రాధిక నటించింది. ముత్తు కి తన సోదరి అంటే అమితమైన ప్రేమ ఉన్నట్లు టీజర్ లో స్పష్టంగా తెలుస్తుంది. ఇందులో మలయాళ నటులు నీరజ్ మాధవ్ - సిద్ధిక్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు.

అయితే బ్రతుకుదెరువు కోసం సిటీకి వచ్చిన తర్వాత.. ముత్తు లైఫ్ మరో టర్న్ తీసుకుంది. ఏదైనా చిన్నపాటి ఉద్యోగం చేసుకోవాలనుకుంటే.. శ్రామిక శక్తిని దోపిడీ చేసే కొందరు వ్యక్తుల వల్ల అతను నేర ప్రవృత్తిలోకి దిగినట్లు కనిపిస్తోంది.

ముత్తు తనను తాను కాపాడుకోవడానికి ఆయుధం చేతబట్టి గూండాలతో ఫైట్ చేయడాన్ని మనం చూడొచ్చు. అదే సమయంలో అతని ప్రేయసితో ప్రయాణాన్ని చూపించారు. అయితే చివరికి ముత్తు ఒక గ్యాంగ్‌ స్టర్‌ గా మారాడని అర్థమవుతోంది.

ముత్తు లైఫ్ జర్నీ ఇంటెన్స్ అండ్ ఎమోషనల్ గా సాగిందని టీజర్ ని బట్టి తెలుస్తోంది. శింబు తన కెరీర్ లో ఇంతకముందు ఎప్పుడూ చేయని సరికొత్త పాత్రలో నటించడమే కాదు.. దీని కోసం చాలా సన్నబడ్డాడు. యాక్టింగ్ లోనూ కొత్త కోణాన్ని చూపించాడు.

దర్శకుడు గౌతమ్‌ మీనన్ ‘ది లైఫ్‌ ఆఫ్‌ ముత్తు’ సినిమాని పలు భాగాలుగా రూపొందించాలని ప్లాన్ చేయగా.. ఫస్ట్ పార్ట్ కి ‘ది కిండ్లింగ్‌’ అని పేరు పెట్టారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా సెప్టెంబర్ 15న ప్రేక్షకులు ముందుకు రానుంది.

గౌతమ్ మీనన్ - శింబు - రెహమాన్ కాంబినేషన్ లో వచ్చిన 'విన్నై తాండి వరువాయా' మరియు 'అచ్చం యెన్బదు మడమైదా' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి. దీంతో ఇప్పుడు 'ది లైఫ్ ఆఫ్ ముత్తు' సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది.

వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఇషారి కె. గణేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జయమోహన్ స్క్రీన్ ప్లే సమకూర్చగా.. సిద్ధార్థ నూని సినిమాటోగ్రఫీ అందించారు. రాజీవన్ ఆర్ట్ డైరెక్టర్ గా.. ఆంటోనీ ఎడిటర్ గా వర్క్ చేశారు. 'మానాడు' చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న శింబు.. 'ముత్తు' సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.