Begin typing your search above and press return to search.

భరత్ అలానే గుర్తుండిపోతాడు

By:  Tupaki Desk   |   2 July 2017 1:17 PM IST
భరత్ అలానే గుర్తుండిపోతాడు
X
హీరో రవితేజ జీవితంలో ఇటీవల చోటు చేసుకున్న పెద్ద విషాదం అతడి తమ్ముడి మరణం. ఆ సమయంలో రవితేజ ఎలాంటి ఆవేదనలో ఉన్నాడో తెలుసుకోకుండా తమ్ముడి అంత్యక్రియలకు కూడా హాజరు కాని కఠినాత్ముడంటూ అతడిపై సోషల్ మీడియాలో విమర్శలు వెంటాడటం మరింత విషాదం. సెలబ్రిటీలమైనంత మాత్రాన కష్టాలు.. కన్నీళ్లు.. బాధలు భయాలకు తామేం అతీతులం కాదని అంటున్నాడు రవితేజ. ఎమోషన్స్ అందరికీ సమానమే అని... అది గుర్తించకుండా కామెంట్ చేయడం ఏమాత్రం సరికాదంటూ రీసెంట్ గా మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మనసులోని ఆవేదనను బయటపెట్టాడు.

‘నా తమ్ముడు అంటే నాకు ఎంతో ఇష్టం. నా ఇద్దరు పిల్లలకు బాబాయితో ఎంతో చేరిక. నన్ను పిలిచినట్లే తననూ నాన్నా అనే పిలుస్తారు. ఎప్పుడూ నవ్వుతూ.. నవ్విస్తూ ఉండేవాడు. తను ఎప్పటికీ మాకు అలాగే గుర్తుండిపోతాడు. సోషల్ మీడియాలో కానీ టీవీల్లో కానీ భరత్ యాక్సిడెంట్ ఫొటోలను మేం చూడలేదు. తమ్ముడనే కాదు.. ఇండస్ట్రీలో ఎవరు చనిపోయినా నేను వెళ్లి చూడలేను. శ్రీహరి చనిపోయిన సమయంలో కుటుంబ సభ్యులను పలకరించడానికి వెళ్లి ఇంటి దగ్గరకు వెళ్లాను. కానీ ఇంట్లోకి వెళ్లలేకపోయాను. గుండెదడతో వెనక్కి తిరిగి వచ్చేశాను. నాకున్న బలహీనత అది. సెలబ్రిటీని అయినంత మాత్రాన ఎమోషన్ లకు అతీతుడినేం కాదు. అందుకే యాక్సిడెంట్ తర్వాత అతడిని చూడటానికి వెళ్లలేకపోయాను. భరత్ చనిపోవడానికి నాలుగు రోజుల ముందు అతడి బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నాం. ఎప్పుడూ లేనిది ఈసారి కేక్ కట్ చేసి ఎంతో సందడి చేశాడు. అది భరత్ చివరి చూపు అతడిని అలాగే గుర్తుంచుకుంటాం.’ అని రవితేజ చెప్పాడు.

‘అయిన వారి మరణం ఎంత బాధపడుతుందో తెలిసీ సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్టు కామెంట్ చేశారు. పైపెచ్చు డబ్బులిచ్చి బయట వ్యక్తులతో అంత్యక్రియలు చేశామంటూ అభాండాలు మోపారు. అంత్యక్రియలు చేసింది మా బాబాయే. బాధలో ఉన్నవారి పట్ల సానుభూతితో ఆలోచించాలి తప్ప ఇష్టమొచ్చినట్టు రాసేయడం సరికాదని’ రవితేజ తన ఫీలింగ్ పంచుకున్నాడు. సోషల్ మీడియా ఫేమస్ అయిపోవాలని తెగ ఆరాటపడిపోయేవారంతా కాస్త ఆలోచించాల్సిన ఇది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/