Begin typing your search above and press return to search.

ప్రేక్ష‌కుల్ని రిక్వెస్ట్ చేస్తున్న 'కాంతార‌' స్టార్‌!

By:  Tupaki Desk   |   22 Oct 2022 12:30 AM GMT
ప్రేక్ష‌కుల్ని రిక్వెస్ట్ చేస్తున్న కాంతార‌ స్టార్‌!
X
'కాంతార‌'.. దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తున్న పేరిది. క‌న్న‌డ హీరో, ద‌ర్శ‌కుడు రిష‌బ్ శెట్టి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఈ మూవీ సెప్టెంబ‌ర్ లో క‌న్న‌డ‌లో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని సృష్టించి బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. ప్ర‌స్తుతం తెలుగులోనూ అదే త‌ర‌హా జోరుని చూపిస్తూ ఊహించ‌ని విధంగా బాక్సాఫీస్ వ‌ద్ద ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లోనూ రికార్డు స్థాయిలో వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది. తెలుగులో ఈ మూవీని స్టార్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ గీతా ఫిలిం డిస్ట్రిబ్యూష‌న్ ద్వారా విడుద‌ల చేశారు.

క‌న్న‌డ‌లో 'కేజీఎఫ్' మేక‌ర్స్ హోంబ‌లే ఫిలింస్ క‌ర్ణాట‌క‌లోని గిరిజ‌న సంప్ర‌దాయ‌మైన భూత‌కోల ఆధారంగా ఈ మూవీని హీరో రిష‌బ్ శెట్టి న‌టించి స్వీయ ర‌చ‌న‌లో తెర‌కెక్కించాడు. సంస్కృతి సంప్ర‌దాయాల మేళ‌వింపుతో తెర‌కెక్కిన ఈ మూవీ ద‌క్షిణాదితో పాటు ఉత్త‌రాది ప్రేక్ష‌కుల్ని కూడా విశేషంగా ఆక‌ట్టుకుంటూ యావ‌త్ దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇప్ప‌టికే క‌న్న‌డ‌లో రూ. 100 కోట్ల‌కు పైగా రాబ‌ట్టిన ఈ మూవీ తెలుగులో ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 22 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది.

క‌న్న‌డ‌తో పాటు తెలుగు, త‌మిళ, హిందీ భాష‌ల్లో ఎలాంటి అంచ‌నాలు లేకుండా విడుద‌లైన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల సునామీని సృష్టిస్తోంది. ఈ సినిమాకు మౌత్ టాక్ భారీ స్థాయిలో ప‌ని చేస్తుండ‌టంతో సినిమా చూడ‌టానికి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులు ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తున్నారు. అంతే కాకుండా క‌ర్ణాట‌క‌లోని భూత‌కోల నేప‌థ్యంలో రూపొందిన ఈ మూవీలో హీరో రిష‌బ్ శెట్టి భూత‌కోల ఆడే వ్య‌క్తిగా స‌రికొత్త వేష‌ధార‌ణ‌లో క‌నిపించిన తీరు కూడా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది.

ఇదిలా వుంటే సినిమాలో భూత‌కోల ఆడే స‌మ‌యంలో వ్య‌క్తులు 'ఓ' అనే వింత శ‌బ్దం చేస్తార‌ని సినిమాలో చూపించారు. ఇక సినిమాలోని ప‌లు కీల‌క సంద‌ర్భాల్లో 'భూత‌కోల‌' ఆడే వ్య‌క్తిగా విచిత్ర వేష‌ధార‌ణ‌తో హీరో రిష‌బ్ శెట్టి చేసే 'ఓ' అనే శ‌బ్దం ఇప్ప‌డు థియేట‌ర్లలో మారుమ్రోగుతోంది.

ఆ ధ్వ‌ని వినిపించిన ప్ర‌తీసారిప్రేక్ష‌కులు అదే ప‌దాన్ని అనుక‌రిస్తుండ‌టంతో 'కాంతార‌' ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతున్న థియేట‌ర్లు ప్రేక్ష‌కుల రియాక్ష‌న్ కు ద‌ద్ద‌రిల్లుతున్నాయి. సినిమా చూసి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రువాత కూడా ప్రేక్ష‌కులు అదే ప‌దాన్ని ప‌లుకుతూ త‌మ ఆనందాన్ని పంచుకుంటున్నారు.

ఈ విష‌యంలో ఆ ప‌దాన్ని ప‌ల‌క‌రాద‌ని హీరో రిష‌బ్ శెట్టి ప్రేక్ష‌కుల్ని రిక్వెస్ట్ చేస్తున్నాడు. 'ఓ అనేది కేవ‌లం శ‌బ్దం మాత్ర‌మే కాద‌ని, అది త‌మ‌కు సెంటిమెంట్ అని తెలిపారు. 'కాంతార‌' వీక్షించే ప్రేక్ష‌కులకు నా చిరు విన్న‌పం. సినిమాలో ఉప‌యోగించిన శ‌బ్దాల‌ను అనుక‌రించొద్దు. ఇదొక సంప్ర‌దాయ ఆచారం. ఆధ్యాత్మిక న‌మ్మ‌కం. అంతే కాకుండా ఇది చాలా సున్నిత‌మైన అంశం. అంత‌కూ అనుకరించ‌డం వ‌ల్ల ఆచారం దెబ్బ‌తినే అవ‌కాశం వుంది' అంటూ ప్రేక్ష‌కుల్ని రిక్వెస్ట్ చేశాడు రిష‌బ్ శెట్టి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.