Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : జంగిల్ బుక్ (తెలుగు)

By:  Tupaki Desk   |   9 April 2016 11:05 AM GMT
మూవీ రివ్యూ : జంగిల్ బుక్ (తెలుగు)
X
చిత్రం: జంగిల్ బుక్ (తెలుగు)

ఏకైక నటుడు: నీల్ సేథి
సంగీతం: జాన్‌ డెబ్నీ
ఛాయాగ్రహణం: బిల్‌ పోప్‌
మూల కథ: రూడ్ యార్డ్ కిప్లింగ్
స్క్రీన్ ప్లే: జాన్ ఫెవ్రో-జస్టిన్ మార్క్స్
నిర్మాణ సంస్థ: వాల్ట్ డిస్నీ
దర్శకత్వం: జాన్ ఫెవ్రో

జంగిల్ బుక్.. 90ల్లో చిన్నా పెద్దా అని తేడా లేకుండా భారతీయ ప్రేక్షకులందరినీ కట్టిపడేసిన కార్టూన్ సిరీస్. ముఖ్యంగా ఆ తరం చిన్న పిల్లలకు అది జీవితాంతం గుర్తుండిపోయే ఓ మధుర జ్నాపకం. అప్పుడు కార్టూన్ క్యారెక్టర్లతోనే అంతగా మెప్పించిన ‘జంగిల్ బుక్’.. ఇప్పుడు జీవం ఉన్న పాత్రలతో సినిమాగా తెరకెక్కింది. ప్రతిష్టాత్మక వాల్ట్ డిస్నీ నిర్మాణంలో.. మన దేశానికే చెందిన నీల్ సేథి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం.. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

చిన్నతనం నుంచే అడవికి అంకితమైపోయిన పిల్లాడు మోగ్లీ (నీల్ సేథి). పసి పిల్లాడిగా తనకు దొరికిన మోగ్లీని భగీర అనే నల్ల చిరుత తీసుకెళ్లి.. అకీలా అనే తోడేళ్ల నాయకుడికి అప్పగిస్తుంది. తోడేళ్ల గుంపంతా కలిసి మోగ్లీని ప్రేమగా పెంచుతాయి. ఐతే క్రూర మనస్తత్వం ఉన్న షేర్ ఖాన్ అనే పులికి మాత్రం మోగ్లీ అంటే గిట్టదు. కరవు వెళ్లిపోగానే అతణ్ని చంపేయడానికి కాచుకుని ఉంటుంది. ఈ సంగతి తెలిసి.. భగీరాతో పాటు తోడేళ్ల గుంపు అతణ్ని మనుషులుండే చోటికి పంపించేయాలని చూస్తాయి. కానీ మోగ్లీకి అడవిని వదిలి వెళ్లడం ఇష్టముండదు. అయినా తప్పనిసరి పరిస్థితుల్లో భగీరాతో కలిసి ప్రయాణం మొదలుపెడతాడు. ఇంతలో షేర్ ఖాన్ వీళ్లపై దాడికి దిగుతుంది. ఈ దాడి నుంచి తప్పించుకుని మోగ్లీ ఎలా బయటపడ్డాడు.. ఆ తర్వాత అతడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి.. చివరికి మోగ్గీ షేర్ ఖాన్ మీద ఎలా గెలిచాడు.. అన్నది మిగతా కథ.

విశ్లేషణ:

జంగిల్ బుక్ కథ మనకు తెలియంది కాదు.. ఐతే ఒకప్పుడు కార్టూన్ క్యారెక్టర్లతో తెరకెక్కిన మామూలు ఎపిసోడ్లకు పులకించిపోయిన ప్రేక్షకులకు ఈ సరికొత్త ‘జంగిల్ బుక్’ అద్భుతమైన అనుభూతిని పంచుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదొక విజువల్ వండర్. మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లి.. విహార యాత్ర చేయించి.. నవ్వించి.. భయపెట్టి.. కొన్నిసార్లు గుండె తడి చేసి.. ఎమోషన్లను తట్టిలేపి.. చివరగా ఒక గొప్ప అనుభూతితో థియేటర్ల నుంచి బయటికి వచ్చేలా చేస్తుంది.

‘జంగిల్ బుక్’లో ఉన్నది ఒకే ఒక్క నటుడు. అతను నీల్ సేథి. మిగతావన్నీ కూడా యానిమేటెడ్ క్యారెక్టర్లే. కానీ సినిమా మొదలైన కాసేపటికే అవి యానిమేటెడ్ క్యారెక్టర్లన్న సంగతి మరిచిపోతుంది. అవి నిజంగా జీవం ఉన్న పాత్రలే అన్నట్లుగా సినిమాలో లీనమైపోతాం. బెంగాల్ టైగర్ క్రూరత్వం చూసి కసి పెంచుకుంటాం. తోడేలు తల్లి బాధ చూసి కరిగిపోతాం.. నల్ల చిరుత గొప్ప మనసుకి సెల్యూట్ కొడతాం.. ఎలుగుబంటి చమత్కారానికి నవ్వుకుంటాం.. అడవిని కాపాడటానికి ఏనుగులు చేసే ప్రయత్నం చూసి హ్యాట్సాఫ్ అనుకుంటాం.. మొత్తంగా ఈ పాత్రలన్నింటినీ అంతగా ఓన్ చేసుకుంటాం.

త్రీడీలో అద్భుతమైన విజువల్ ఎఫెక్టుల మధ్య ‘జంగిల్ బుక్’ చూస్తున్నంతసేపూ నిజంగా మనం ఓ దట్టమైన అడవిలో జంతువుల మధ్య సంచరిస్తున్న భావన కలుగుతుంది. ఎక్కడా అసహజంగా అనిపించకుండా అత్యద్భుతంగా సమకూరిన విజువల్ ఎఫెక్టులు సినిమాకు ప్రధాన ఆకర్షణ కాగా.. యానిమేటెడ్ రూపంలో జంతువుల్ని సృష్టించి.. వాటితో డైలాగులకు తగ్గట్లుగా అద్భుతమైన హావభావాలు పలికించిన తీరుకు ముగ్ధులైపోవడం ఖాయం. పలికే ప్రతి మాటకు తగ్గట్లుగా జంతువుల హావభావాలు చూస్తుంటే.. అవి నిజమైన జంతువులేనా.. వాటికి నిజంగానే మాటలు వచ్చేశాయా అన్న భ్రమలు కలగడం ఖాయం.

కేవలం విజువల్ ఎఫెక్టులతో కంటికి ఇంపైన దృశ్యాలు చూపించి పంపేయకుండా ఓ మంచి కథను చెప్పడానికి.. మనలోని ఎమోషన్లను తట్టి లేపడానికి ప్రయత్నించడం ‘జంగిల్ బుక్’లోని ప్రత్యేకత. కొడుకులా పెంచుకున్న మోగ్లీ తనను వదిలి వెళ్లిపోతున్నపుడు తోడేలు తల్లి బాధ చూస్తే ఓ భారమైన ఫీలింగ్ కలుగుతుంది. ఎలుగుబంటి మోగ్లీ మనసు విరిచేసే మాటలు మాట్లాడి ఓ నిట్టూర్పు విడిచినపుడు కూడా అలాంటి భావనే కలుగుతుంది. ఇక సందర్భోచితంగా వినోదాన్నిచ్చే సన్నివేశాలకు.. మాటలకు కొదవలేదు. చివర్లో మోగ్లీ.. షేర్ ఖాన్ పని పట్టే దృశ్యాలు ఉత్కంఠ రేపుతాయి. ఉద్వేగాన్ని కలిగిస్తాయి. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు కొంచెం నత్తనడకన సాగినట్లు కనిపించినా కానీ.. ఓవరాల్ గా ‘జంగిల్ బుక్’ మంచి అనుభూతిని కలిగిస్తుంది.

మోగ్లీ పాత్రలో నీల్ సేథి అద్భుతంగా నటించాడు. చుట్టూ ఏమీ లేకున్నా.. అంతా ఉన్నట్లు ఆ చిన్న పిల్లాడు అలా ఊహించుకుని నటించడం చిన్న విషయం కాదు. ఇక సాంకేతిక వర్గం పనితనం గురించి ఎంత చెప్పినా తక్కువే. వాల్ట్ డిస్నీ నిర్మాణ విలువలు అద్భుతం. సంగీతం.. ఛాయాగ్రహణం.. విజువల్ ఎఫెక్టులు.. అన్నీ అద్భుతంగా కుదిరాయి. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే చేశారు. మాటలు బాగున్నాయి. చిన్నా పెద్దా అని తేడా లేకుండా ఎవ్వరైనా ఈ ‘జంగిల్ బుక్’ను ఆస్వాదించవచ్చు. పిల్లలు ఎలాగూ ఈ చిత్రంతో ఈజీగా కనెక్టయిపోతారు. ఇక నిన్నటితరం ప్రేక్షకులు నాటి జంగిల్ బుక్ జ్జాపకాల్ని గుర్తు తెచ్చుకుని.. వెండితెరకెక్కిన తమ ఫేవరెట్ కార్టూన్ సిరీస్ చూసి ఓ గొప్ప అనుభూతికి లోనవుతారు. ఇదేదో పిల్లల సినిమా అని తేలిగ్గా తీసేయకుండా కుటుంబ సమేతంగా ‘జంగిల్ బుక్’ చూసి ఆస్వాదించవచ్చు. ఐతే ‘జంగిల్ బుక్’ను సరిగ్గా అనుభూతి చెందాలంటే త్రీడీలోనే చూడాలి.

రేటింగ్: 3.25/5