Begin typing your search above and press return to search.

వసూళ్లో షేర్ ఖాన్.. జంగిల్ బుక్

By:  Tupaki Desk   |   16 May 2016 3:30 PM GMT
వసూళ్లో షేర్ ఖాన్.. జంగిల్ బుక్
X
జంగిల్ బుక్ సినిమా పిల్లలనే కాకుండా పెద్దలనూ ఆకట్టుకుంటోంది. విడుదలైన ఆరువారాల తరువాత కూడా ఆదరణ ఇంకా తగ్గలేదు. అయితే... క్రమంగా ఈ సినిమాను ఆడిస్తున్న థియేటర్లు తగ్గుతున్నా కూడా కలెక్షన్ల విషయంలో మాత్రం దూకుడు చూపుతోంది. ఇంగ్లీష్, హిందీలతో పాటు ఒక్కటొక్కటిగా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదలవుతుండడంతో కలెక్షన్లు నిలకడగా ఉన్నాయి. ఆదివారం వరకు ఈ సినిమా కలెక్షన్లు రూ.249.41 కోట్లు కావడం విశేషం. ఒక్క ఆదివారం రోజునే ఇది 1.1 కోట్లను వసూలు చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా 828 మిలియన్ డాలర్ల కలెక్షన్లతో ఈ ఏడాది హయ్యెస్టు కలెక్షన్లున్న సినిమాల్లో నాలుగో స్థానంలో నిలిచింది. భాషతో సంబంధం లేకుండా చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా దీన్ని చూస్తుండడంతో మంచి కలెక్షన్లు వస్తున్నాయి. స్టార్ హీరోలు ఎవరూ లేకుండా కేవలం నీల్ సేథి అనే ఒకే ఒక్క బాల నటుడితో, మిగతా గ్రాఫిక్ పాత్రలతో నడిచిన ఈ సినిమా అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది.

రుడ్యార్డ్ కిప్లింగ్ నవల ఆధారంగా తీసిన ఈ సినిమాలో పాత్రలన్నీ జంతువులే. ఒకే ఒక్క పాత్ర నీల్ సేథీది. బాలీవుడ్ నటులు ప్రియాంకా చోప్రా, ఇర్ఫాన్ ఖాన్ వంటివారు ఈ సినిమా హిందీ వెర్షన్లో జంతువుల పాత్రలకు డబ్బింగ్ చెప్పడం విశేషం. ఈ 3డీ సినిమాను చూస్తున్న పిల్లలు మళ్లీమళ్లీ వెళ్లాలనుకుంటున్నారట. ఆ కారణంగా కూడా కలెక్షన్లు అధికమవుతున్నాయి.