Begin typing your search above and press return to search.

రిలీజ్ ల‌తో ఊపిరాడ‌నివ్వ‌ని ప‌రిశ్ర‌మ‌

By:  Tupaki Desk   |   27 Sept 2021 2:03 PM IST
రిలీజ్ ల‌తో ఊపిరాడ‌నివ్వ‌ని ప‌రిశ్ర‌మ‌
X
యావ‌త్ దేశ‌ వ్యాప్తంగా క్రేజ్ వున్న బాలీవుడ్ ఇండ‌స్ట్రీ కోవిడ్ కార‌ణంగా ఇప్ప‌టికీ కోలుకోవ‌డం లేదు. టాలీవుడ్ కు ఉభ‌య తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు లైన్ క్లియ‌ర్ చేయ‌డం.,. థియేట‌ర్ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో ఇక్క‌డ పండ‌గ వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతోంది. కానీ బాలీవుడ్ లో మాత్రం ఇప్ప‌టికీ అక్క‌డి ప్ర‌భుత్వం థియేట‌ర్ల రీఓపెన్ కి అనుమ‌తులు నిరాక‌రించ‌డంతో గ‌త కొంత కాలంగా గ‌డ్డు ప‌రిస్థితుల్ని ఎదుర్కొంటోంది. కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్ర‌త కార‌ణంగా మ‌హారాష్ట్ర‌లో థియేట‌ర్లు తెరుచుకోలేదు. దీంతో చాలా వ‌ర‌కు క్రేజీ సినిమాల రిలీజ్ లు ఆగిపోయాయి.

తాజాగా మ‌హా ప్ర‌భుత్వం అక్టోబ‌ర్ 22 నుంచి థియేట‌ర్ల‌ని రీఓపెన్ చేసుకోవ‌చ్చ‌ని ఉత్త‌ర్వులు జారీ చేయ‌డంతో బాలీవుడ్ వ‌ర్గాల్లో నూత‌నోత్తేజం తొణికిస‌లాడుతోంది. దీంతో షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కి రెడీగా వున్న త‌మ చిత్రాల రిలీజ్ డేట్ ల‌ని బాలీవుడ్ వ‌ర్గాలు ఆదివారం ప్ర‌క‌టించేశాయి. చాలా కాలంగా థియేట‌ర్ రిలీజ్ కోసం ఎద‌రుచూస్తున్న బిగ్ స్టార్స్ బిగ్ స్క్రీన్‌పై సంద‌డి చేసేందుకు రెడీ అవుతున్నారు. చాలా రోజులుగా థియేట‌ర్స్ రీఓపెన్ కోసం ఆశ‌గా ఎదురుచూస్తున్న స్టార్ హీరోలు.. ద‌ర్శ‌కులు.. నిర్మాత‌లు త‌మ చిత్రాల‌కు సంబంధించిన న్యూ రిలీజ్ డేట్‌ల‌ని ప్ర‌క‌టించారు.

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా న‌టించిన చిత్రం `జెర్సీ`. గౌత‌మ్ తిన్న‌నూరి తెర‌కెక్కించిన ఈ మూవీ తెలుగులో సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించిన విష‌యం తెలిసిందే. ఇదే చిత్రాన్ని షాహీద్ క‌పూర్ హీరోగా రీమేక్ చేశారు. అల్లు అర‌వింద్.. సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ.. అమ‌న్ గిల్‌.. దిల్‌రాజు సంయుక్తంగా ఈ మూవీని రీమేక్ చేశారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీని డిసెంబ‌ర్ 31న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లుగా చిత్ర బృందం ప్ర‌క‌టించింది.

ఇదే బాట‌లో ర‌ణ్ వీర్ సింగ్ న‌టించిన `83` చిత్రం క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. క్రిస్మ‌స్ కి విడుద‌ల చేయాల‌ని భావించిన అమీర్ ఖాన్ `లాల్ సింగ్ చ‌ద్దా` కోవిడ్ కార‌ణంగా షూటింగ్ ఆల‌స్యం కావ‌డంతో వ‌చ్చే ఏడాది ప్రేమికుల రోజుకి పోస్ట్ పోన్ అయింది. ఇక ఖిలాడీ అక్ష‌య్ కుమార్ న‌టిస్తున్న `బ‌చ్చ‌న్ పాండే` వ‌చ్చే ఏడాది మార్చి 4న రానుండ‌గా `పృథ్విరాజ్‌` సంక్రాంతి త‌రువాత జ‌న‌వ‌రి 21న విడుద‌ల కానుండ‌గా.. `రామ్ సేతు` వ‌చ్చే ఏడాది దీపావ‌ళికి రిలీజ్ కాబోతోంది. కార్తిక్ ఆర్య‌న్ `భూల్ బులాయా 2` మార్చిలో రాబోతోంది. ఓవ‌రాల్ గా 20 సినిమాల వ‌ర‌కూ విడుద‌ల కానున్నాయి.

అంతా బాగానే వుంది అయితే డిసెంబ‌ర్‌లో విడుద‌ల కానున్న సినిమాల‌కి వారం ముందు తెలుగు సినిమాలు సంద‌డి చేయ‌బోతున్నాయి. డిసెంబ‌ర్ 24న అఖిల్ అక్కినేని న‌టిస్తున్న `ఏజెంట్‌` విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుండ‌గా ఒక్క రోజు తేడాతో అంటే డిసెంబ‌ర్ 25న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న `పుష్ప‌` విడుద‌ల కాబోతోంది. ఈ రెండు చిత్రాలూ తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల‌తో పాటు హిందీలోనూ రిలీజ్ కాబోతున్నాయి. ఇవి హిందీ చిత్రాల‌కు పోటీగా నిలుస్తాయో చూడాలి.