Begin typing your search above and press return to search.

తాప్సీకి షాకింగ్ కాంప్లిమెంట్ ఇచ్చిన పెద్దాయన

By:  Tupaki Desk   |   26 July 2020 9:20 AM IST
తాప్సీకి షాకింగ్ కాంప్లిమెంట్ ఇచ్చిన పెద్దాయన
X
టాలీవుడ్ లో కనిపించని సీన్లు కొన్ని బాలీవుడ్ లో తరచూ కనిపిస్తుంటాయి. ఒక నటుడి మీద మరో నటుడు ఓపెన్ గా నోరు పారేసుకోవటం.. ఒక నటి మీద మరో నటి విరుచుకుపడటం లాంటివి మామూలే. ఈ మధ్యనే విలక్షణ నటి తాప్పీ మీద అదే పనిగా నోరు పారేసుకుంటోంది ప్రముఖ నటి కంగనారౌత్. ఆమెను బి గ్రేడ్ ఆర్టిస్ట్ గా పేర్కొంటూ చేసిన వ్యాఖ్యపై పలువురు విస్మయానికి గురయ్యారు.

ప్రయోగాత్మక సినిమాల్లో నటించటమే కాదు.. క్యారెక్టర్ ఏదైనా అందులో లీనమైపోవటం..పాత్ర తప్పించి తాప్సీ కనిపించదన్న కాంప్లిమెంట్లు పలువురు ఇస్తుంటారు. అలాంటి ఆమెను.. కంగనా బి గ్రేడ్ ఆర్టిస్ట్ గా వ్యాఖ్యానించటంపై పలువురు తప్పు పడుతున్నారు. సాధారంగా నటీనటుల మధ్య జరిగే మాటల యుద్ధంలో కల్పించుకోని ఒక ప్రముఖుడు ఎంట్రీ ఇవ్వటం ఆసక్తికరంగా మారింది.

హైకోర్టు.. సుప్రీంకోర్టుల్లో న్యాయమూర్తిగా పని చేయటంతో పాటు.. న్యాయకోవిదుడిగా పేరున్న మార్కండేయ కట్జూ తాజాగా కంగనా చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఊహించని రీతిలో తాప్సీకి బాసటగా నిలిచారు. ‘‘నువ్వు బి గ్రేడ్ ఆర్టిస్ ఏ మాత్రం కాదు. నువ్వు ఏ గ్రేడ్ ఆర్టిస్ట్ వి ’’ అంటూ ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన తాప్సీ.. థ్యాంక్యూ సో మచ్ సార్ అని రీట్వీట్ చేశారు.

తాప్సీ నటన గురించి మరింతగా పేర్కొన్న కట్జూ.. తాను లాయర్ గా ఇరవై ఏళ్లు.. హైకోర్టు.. సుప్రీంకోర్టులో జడ్జిగా తాను మరో ఇరవై ఏళ్లు పని చేశానని చెప్పారు. న్యాయవాద రంగంలో తాను చాలామంది లాయర్లను చూశానని.. నిజ జీవితంలో లాయర్లు ఎలా ఉంటారు? వారి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందని తనకు బాగా తెలున్నారు.

తాప్సీ నటించిన ‘‘ముల్క్’’ మూవీని తాను కాలిఫోర్నియాలో చూశానని చెప్పారు. ఆ సినిమాలో లాయర్ గా నటించిన తాప్సీ నటన అద్భుతంగా ఉందన్నారు. నిజమైన లాయర్ మాదిరే తాప్సీ నటన ఉందన్నారు. ఆ సినిమాలో తాప్సీని చూసిన తాను.. నిజమైన లాయర్ గానే భావించానని చెప్పారు. ‘ఈ సినిమాలో నటించటానికి ముందు నువ్వు ఎవరైనా లాయర్ వద్ద సలహాలు.. సూచనలు తీసుకున్నారా?’’ అని కట్జూ సందేహానికి స్పందించారు తాప్సీ.

‘‘అవును సార్.. ఈ సినిమాలో లాయర్ పాత్ర పోషించటానికి ముందు ఒక న్యాయవాది వద్ద శిక్షణ పొందా’’ అని పేర్కొన్నారు. తాప్సీ సమాధానికి స్పందించిన కట్జూ.. ‘ఈ సినిమాలో మీరు పోషించిన పాత్ర వాస్తవానికి దగ్గరగా ఉంది. నిజంగానే లాయర్ గా నువ్వు కోర్టులో నా ముందు ఉండాలని కోరుకుంటున్నా’’ అంటూ తన అభిలాషను వ్యక్తం చేశారు. కట్జూ కాంప్లిమెంట్లను స్ఫూర్తిగా తీసుకొని తాప్సీ నిజంగానే న్యాయవాద కోర్సు చేస్తుందో లేదో కాలమే తేల్చాలి. ఏమైనా.. కట్జూ లాంటి న్యాయకోవిదుడు ఈ స్థాయిలో తాప్సీని పొగిడేయటం.. కంగనా అండ్ కో ఆత్మరక్షణలో పడినట్లేనని చెప్పక తప్పదు.