Begin typing your search above and press return to search.

బాలు చికిత్స పొందుతున్న వార్డులో అలా చేస్తున్నారట

By:  Tupaki Desk   |   18 Aug 2020 9:45 AM IST
బాలు చికిత్స పొందుతున్న వార్డులో అలా చేస్తున్నారట
X
కరోనా బారిన పడిన ప్రముఖ గాయకుడు ఎస్ పీ బాలసుబ్రమణ్య ప్రస్తుతం చెన్నైలోని ఎంజీఎంలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యం ఏ మాత్రం బాగోలేకపోవటంతో ఐసీయూలో ఉంచి ట్రీట్ మెంట్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి మీద వైద్యులు.. బాలు కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు అప్డేట్ చేస్తున్నారు. కరోనా బారిన పడి.. తీవ్ర అనారోగ్యం పాలైన బాలు వెంటనే కోలుకోవాలంటూ పలు రంగాలకు చెందిన ప్రముఖులు సందేశాలు ఇస్తున్నారు.

కరోనాతో ఈ నెల ఐదున ఎంజీఎంలో చేరిన ఆయన ఆరోగ్యం అంతకంతకూ క్షీణించి ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయన త్వరగా కోలుకొని.. ఆరోగ్యంగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కావాలని కోరుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వార్తలతో ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే.. ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయనకు కోలుకునేందుకు వీలుగా ఆయన పాటల్ని ప్లే చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఆయన ఉన్న వార్డులో ఆయన పాడిన పాటల్ని ఆడియో ద్వారా ప్రసారం చేస్తున్నట్లుగా వైద్యులు చెబుతున్నారు.

బాలు త్వరగా కోలుకొని బయటకు రావాలంటూ తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీరుసెల్వంతో పాటు.. ప్రముఖ నటులు రజనీకాంత్.. కమల్ హాసన్ తో పాటు పలు రాజకీయ.. సినిమా రంగానికి చెందిన ప్రముఖులు కోరుకుంటున్నారు. వారి ప్రార్థనలు ఫలించి.. బాలు త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం. అదే ఆసుపత్రిలో కరోనా బారిన పడిన ఎస్పీ సతీమణి సావిత్రి కూడా చికిత్స పొందుతున్నారు. కాకుంటే.. ఆమెకు కరోనా స్వల్పంగా సోకినట్లుగా వైద్యులు పేర్కొన్నారు.