Begin typing your search above and press return to search.

#మీటూ ప‌ర్య‌వ‌సానం ఇంకా నిషేధం కొన‌సాగుతోంద‌ని గాయ‌ని ఆవేద‌న‌!

By:  Tupaki Desk   |   14 March 2021 7:00 AM IST
#మీటూ ప‌ర్య‌వ‌సానం ఇంకా నిషేధం కొన‌సాగుతోంద‌ని గాయ‌ని ఆవేద‌న‌!
X
2018లో మొద‌లైన మీటూ ఉద్య‌మం ఆ త‌ర్వాత ఎలాంటి ప్ర‌కంప‌నాల‌కు తెర తీసిందో తెలిసిందే. ఈ వేదిక‌పై ఎంద‌రో క‌థానాయిక‌లు.. గాయ‌నీమ‌ణులు.. న‌టీమ‌ణులు త‌మ‌కు జ‌రిగిన అన్యాయాల్ని.. లైంగిక వేధింపుల్ని బహిర్గ‌తం చేసారు. కొంద‌రిపై వేధింపుల కేసులు న‌మోద‌య్యాయి. ఆ త‌రవాత దానినుంచి ప‌లువురు బ‌య‌ట‌ప‌డగ‌లిగినా.. మ‌రికొంద‌రిపై ఇంకా విచార‌ణ‌లు సాగుతూనే ఉన్నాయి.

ఇక‌పోతే త‌మిళ ప‌రిశ్ర‌మ‌లో సీనియ‌ర్ లిరిసిస్ట్ వైర‌ముత్తు త‌న‌ని వేధించార‌ని గాయ‌ని చిన్మ‌యి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డం అటుపై కోలీవుడ్ లో డ‌బ్బింగ్ అసోసియేష‌న్ త‌న‌పై నిషేధం విధించ‌డం తెలిసిందే. ఇప్ప‌టికీ చిన్మ‌యిని కోలీవుడ్ నిషేధానికి గురి చేసింద‌ట‌. ఇదే విష‌యాన్ని తాను బ‌హిరంగ వేదిక‌పై ప్ర‌క‌టించి షాక్ కి గురి చేశారు.

అదృష్ట వ‌శాత్తూ త‌న‌ని ఇరుగు పొరుగు ప‌రిశ్ర‌మ‌లు ఆద‌రిస్తున్నాయ‌ని లేదంటే త‌నకు ఉపాధి లేకుండా పోయేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌న ఆరోప‌ణ‌ల్ని బ‌ట్టి మీటూ వేదిక‌పై ఆరోపించిన చాలా మందికి ఇలాంటి ప‌రిస్థితే ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు.రంగుల మాయా ప్ర‌పంచంలో కొన్ని గుట్టు చ‌ప్పుడు కాకుండా న‌డుస్తుంటాయి. అందులో వివాదాస్ప‌దం అంటే చాలు దూరం పెట్టేస్తారు. చిన్మ‌యి విష‌యంలోనూ అదే జరుగుతోంద‌ని విశ్లేషిస్తున్నారు.