Begin typing your search above and press return to search.

#RRR అల్లూరి పాత్ర‌లో ఆ ట్విస్ట్ షాకిస్తుంద‌ట‌

By:  Tupaki Desk   |   7 March 2021 7:26 AM GMT
#RRR అల్లూరి పాత్ర‌లో ఆ ట్విస్ట్ షాకిస్తుంద‌ట‌
X
2020-21 సీజ‌న్ మోస్ట్ అవైటెడ్ ఇండియన్ సినిమాగా ఆర్.ఆర్.ఆర్ గురించిన ఆస‌క్తిక‌ర చర్చ సాగుతోంది. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరెక్కిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 13 న దసరా కానుక‌గా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌లు భాష‌ల్లో రిలీజ్ కానుంది. పండ‌గ ఫ‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని రిలీజ‌వుతోంది కాబ‌ట్టి ఆద‌ర‌ణ ఆ స్థాయిలోనే ఉంటుంద‌ని జ‌క్క‌న్న అండ్ టీమ్ అంచ‌నా వేస్తున్నారు. ట్రేడ్ కూడా దీనిని న‌మ్ముతోంది.

ఈ మూవీలో మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా రామ్ చ‌ర‌ణ్... గోండు వీరుడు కొమ‌రం భీమ్ పాత్ర‌లో ఎన్టీఆర్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇంత‌కుముందు భీమ్ పెద్ద పులితో పోరాటం చేస్తున్న ఫోటో ఒకటి లీకైపోవ‌డం సంచ‌ల‌నం సృష్టించింది. తార‌క్ అభిమానుల్లో వైర‌ల్ గా దూసుకెళ్లింది ఈ ఫోటో. అలాగే ఈ సినిమాలో చరణ్ లుక్ ఎలా ఉంటుంది? అన్న‌ది కూడా ఇంత‌కుముందు లీకులు అందిన సంగ‌తి తెలిసిందే.

ఇక ఇందులో చ‌ర‌ణ్ పాత్ర‌లో నెగెటివ్ షేడ్ అనే మరో కోణం ఉందని తెలుస్తోంది. చరణ్ బ్రిటిష్ వారి కోసం పనిచేసే పోలీసు అధికారిగా కనిపిస్తారు. అతని పాత్ర‌లో లేయ‌ర్స్ ఉత్కంఠ పెంచేవిగా ఉంటాయిట‌. తాజా సోషల్ మీడియా ప్ర‌చారంతో.. అభిమానుల్లో ఒక్క‌సారిగా అంచనాలను పెంచుతోంది. కొంతకాలం క్రితం వెల్లడైన అల్లూరిగా చరణ్ పాత్ర టీజర్ ప్రేక్షకుల నుండి మంచి స్పందనను పొందింది. తాజా లీకుల‌తో చిత్రంపై మ‌రింత‌గా అంచనాలు పెరిగాయి.

ఇక ఈ మూవీలో వీరుడిగా క‌నిపించేందుకు చరణ్ తనను తాను చాలా మార్చుకున్నాడు. ఫిజిక‌ల్ గా మ‌రింత ఫిట్ గా మారాడు. కోర‌మీసం చుర‌చుర చూపుల‌తో అత‌డు త‌న రూపాన్ని అమాంతం మార్చేయ‌డం అభిమానుల్లో చ‌ర్చ‌కు వచ్చింది. చ‌ర‌ణ్ - తార‌క్ పాత్ర‌లు వేటిక‌వే ప్ర‌త్యేకంగా ఉంటాయి కాబ‌ట్టి అభిమానుల్లో అది ప్ర‌త్యేకంగా చ‌ర్చ‌కు వ‌స్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈ చిత్రంలో ఆలియా భట్- అజయ్ దేవ్‌గన్- శ్రీయా శరణ్ - ఒలీవియా మోరిస్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.