Begin typing your search above and press return to search.

ఆ స్టార్ హీరోకి టాలీవుడ్ పై కోపం పోయినట్లేనా

By:  Tupaki Desk   |   26 Dec 2020 5:00 PM IST
ఆ స్టార్ హీరోకి టాలీవుడ్ పై కోపం పోయినట్లేనా
X
యువ నటుడు సిద్ధార్థ్ ఎంత ప్రతిభగల నటుడో తెలిసిందే. టాలీవుడ్ లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగాడు. ఆపై వరుస పరాజయాలు ఎదురవడంతో ఒకానొక దశలో టాలీవుడ్ పై కోపం పెంచుకున్నాడు. ఇక తెలుగులో సినిమాలు చేయనని ..తమిళ సినిమాలపై దృష్టి పెట్టాడు. సుమారు ఏడేళ్ళుగా సిద్ధార్థ్ తెలుగులో చేయలేదు. మధ్యలో కొన్ని సినిమాల్లో నటిచేందుకు అవకాశం వచ్చినా నటించేందుకు ఆసక్తి చూపలేదు. ఇన్నాళ్ళకు మళ్ళీ సిద్ధార్థ్ కి టాలీవుడ్ పై కోపం తగ్గిపోయినట్లు ఉంది. మళ్ళీ తెలుగులో సినిమాలు చేసేందుకు వరుసగా అంగీకరిస్తున్నాడు. ప్రస్తుతం రెండు తెలుగు సినిమాలు లైన్లో పెట్టాడు.

దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్(2003) సినిమా ద్వారా సిద్ధార్థ్ హీరోగా తన కెరీర్ మొదలు పెట్టాడు. ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వంలో యువ సినిమా చేశాడు. కాగా తెలుగులో 2005లో ప్రభుదేవా దర్శకత్వంలో సిద్ధార్థ్ నటించిన నువ్వొస్తానంటే నేనోద్దంటానా.. సినిమా సంచలన విజయం సాధించింది. దాంతో తెలుగులో సిద్ధార్థ్ కు క్రేజ్ వచ్చింది. ఆ వెంటనే దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన బొమ్మరిల్లు సినిమా ఓ క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది. దీంతో సిద్ధార్థ్ కు తెలుగు నాట ఓ మంచి గుర్తింపు వచ్చింది. ఇక సిద్ధార్థ్ తెలుగులో స్టార్ హీరోగా సెట్ అయినట్లేనని అంతా భావించారు. అయితే ఆ తర్వాత అతడు నటించిన సినిమాలన్నీ వరుసబెట్టి పరాజయం పాలయ్యాయి.

ఆట, అనగనగా ఓ ధీరుడు,ఓయ్, ఓ మై ఫ్రెండ్, ఓయ్, చుక్కల్లో చంద్రుడు, బావ ఇలా వరుస బెట్టి సినిమాలు డిజాస్టర్స్ గా మిగలడంతో ఇక సిద్ధార్థ్ తెలుగులో సినిమాలు చేయడం ఆపేసాడు. 2013లో సమంతతో కలసి చేసిన జబర్దస్త్ మూవీ సిద్ధార్థ్ కు తెలుగులో చివరి సినిమా. ఆ తర్వాత అవకాశాలు వచ్చినా తెలుగులో నటించేందుకు సిద్ధార్థ్ ఆసక్తి చూపలేదు.

ఇన్నేళ్ళకు మళ్ళీ సిద్ధార్థ్ తెలుగులో వరుసగా నటించేందుకు అంగీకారం తెలుపుతున్నాడు. ఇప్పటికే ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి తాజా మూవీ మహాసముద్రంలో ఓ హీరోగా నటించేందుకు ఓకే చెప్పిన సిద్ధార్థ్ ఇప్పుడు మళ్ళీ తనకు బొమ్మరిల్లు వంటి హిట్ ఇచ్చిన దిల్ రాజు నిర్మాణంలో మరో సినిమాలో నటించేందుకు అంగీకారం తెలిపాడని సమాచారం. ఈ సినిమాకు ఉయ్యాలా జంపాలా, మజ్ను ఫేం విరించి వర్మ దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. తెలుగులో వరుసగా రెండు సినిమాల్లో నటించేందుకు సిద్ధార్థ్ అంగీకారం తెలపడంతో టాలీవుడ్ పై కోపం తగ్గిపోయినట్లే ఉందని అంటున్నారు. మరి సిద్ధార్థ్ సెకండ్ ఇన్నింగ్స్ లో అయినా మళ్ళీ పూర్వ వైభవం సాధిస్తాడేమో చూడాలి.