Begin typing your search above and press return to search.

ఇందుకే బీజేపీకి డిపాజిట్లు రావటం లేదు

By:  Tupaki Desk   |   29 Dec 2021 2:00 PM IST
ఇందుకే బీజేపీకి డిపాజిట్లు రావటం లేదు
X
ఆచరణ సాధ్యం కాని హామీలివ్వటంలో బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. విజయవాడలో ప్రజాగ్రహ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వీర్రాజు మాట్లాడిన మాటలు చాలా విచిత్రంగా ఉన్నాయి. గాలికి కొట్టుకుపోయిన విభజన హామీల గురించి ఏమీ మాట్లాడలేదు. ప్రైవేటీకరణ చేయబోతున్న విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ గురించి ఎలాంటి హామీ ఇవ్వలేదు. చాలా సేపు మాట్లాడిన వీర్రాజు మూడు అంశాల్లో మాత్రమే హామీ ఇచ్చారు.

ఈ మూడు అంశాల్లో కూడా వీర్రాజు హామీ ఎందుకు ఇచ్చారంటే ఎలాగు అధికారంలోకి వచ్చేది లేదేని తెలుసు కాబట్టే. ఇంతకీ రాజుగారు ఇచ్చిన హామీలేమిటంటే మొదటిది తమకు అధికారం అప్పగిస్తే మూడేళ్ళల్లో రాజధాని నిర్మిస్తారట. రెండోది విద్య, వైద్యం ఉచితంగా అందిస్తారట. మూడో హామీ ఏమిటంటే చీప్ లిక్కర్ ను 75 రూపాయలకే అందిస్తారట. రాష్ట్రం ఇన్ని సమస్యల్లో ఉంటే రాజుగారికి చీప్ లిక్కర్ ధరలు తగ్గించటం చాలా ముఖ్యమైపోయింది.

మూడేళ్ళల్లో రాజధాని నిర్మాణమంటే ఎవరు నమ్మేవాళ్ళు లేరు. వీర్రాజుకే కాదు స్వయంగా నరేంద్రమోడీయే పూనుకున్నా మూడేళ్ళల్లో రాజధాని నిర్మాణం సాధ్యం కాదు. నిజానికి ఏ నగరాన్ని నిర్మించటం ప్రభుత్వం బాధ్యత కాదు. ప్రభుత్వం నడపటానికి అవసరమైన సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు లాంటివి నిర్మించుకుని మిగిలిన అభివృద్ధిని ప్రజలకు వదిలిపెట్టేయాలి. అప్పుడు సహజంగానే నగరం అభివృద్ధి అవుతుంది. ఇపుడున్న రాజధానులేవీ ఐదేళ్ళల్లోనో, పదేళ్ళల్లోనో కట్టింది కాదు, అభివృద్ధి జరిగింది కాదు.

సరే ప్రజాగ్రహ సభలో వీర్రాజు, జవదేకర్ లాంటి వాళ్ళు ఎవరు మాట్లాడినా చంద్రబాబునాయుడు, జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకున్నారు. విభజన హామీలను మోడీ సర్కార్ ఎందుకు తుంగలో తొక్కేసిందనే విషయాన్ని ప్రస్తావనే లేదు. వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణను ఆపేస్తామన్న హామీయే ఇవ్వలేదు. ఎంతసేపు తమలోని తప్పులను దాచిపెట్టుకుని చంద్రబాబు, జగన్ కు తామే ప్రత్యామ్నయమని డప్పుకొట్టుకోవటంతోనే సరిపోయింది.

ఏడేళ్ళల్లో కేంద్రంలో బీజేపీ బలంగా ఉన్నా రాష్ట్రంలో ఎందుకింత దయనీయ స్థితిలో ఉందో విశ్లేషణే కనబడలేదు. పార్టీ ఎక్కడ పోటీచేసినా కనీసం డిపాజిట్లు కూడా ఎందుకు తెచ్చుకోలేకపోతొందో కమలనాథుల ప్రసంగాలు వింటే అర్ధమైపోతుంది. ఎంతసేపు బెయిల్ మీదున్న వాళ్ళు తొందరలోనే జైలుకు పోతారనే ఊకదంపుడు ఉపన్యాసాల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని బీజేపీ నేతలు తెలుసుకోలేకపోవటమే ఆశ్చర్యంగా ఉంది.