Begin typing your search above and press return to search.

ఆ డైరెక్టర్ రూటే సెపరేటు..!

By:  Tupaki Desk   |   18 April 2021 12:30 AM GMT
ఆ డైరెక్టర్ రూటే సెపరేటు..!
X
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో డేషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఒకరు. స్టార్ హీరోలందరితో వర్క్ చేసిన పూరీ ఎన్నో బ్లాక్ బస్టర్స్ సూపర్ హిట్స్ అందించారు. అయితే ఆ మధ్య సరైన హిట్ లేక రేసులో కాస్త వెనుకబడిపోయినప్పటికీ.. 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు. అయితే తన తోటి దర్శకులందరూ స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ పోతుంటే.. పూరీ మాత్రం స్టార్ హీరోలను రెడీ చేసే పనిలో ఉన్నాడు. ఇస్మార్ట్ విజయంతో టాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమా కోసం వెయిట్ చేయకుండా.. యువ హీరో విజయ్ దేవరకొండతో మూవీ అనౌన్స్ చేసాడు పూరీ.

పూరీ జగన్నాథ్ - సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'లైగర్' మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. 'సాలా క్రాస్ బ్రీడ్' అనే ట్యాగ్ లైన్ తో మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో ఈ చిత్రాన్ని హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే ముంబైలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో భారీ షెడ్యూల్ కంప్లీట్ చేశారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు హిందీ తమిళ మలయాళ కన్నడ భాషల్లో రూపొందిస్తున్నారు. ఇది పూరీ కి ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్. తన తోటి అగ్ర దర్శకులందరూ స్టార్ హీరోలతో పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే.. పూరీ మాత్రం పాన్ ఇండియా కోసం విజయ్ ని ఎంచుకున్నాడు. 'లైగర్' సినిమాతో విజయ్ దేవరకొండ మార్కెట్ ని పెంచడంతో పాటుగా పూరీ సత్తా ఏంటో ప్రూవ్ చేసుకుంటాడేమో చూడాలి.