Begin typing your search above and press return to search.

క‌ర‌ణ్ జోహార్ ని ఫాలో అవుతున్న త‌రుణ్ భాస్క‌ర్...!

By:  Tupaki Desk   |   22 April 2020 1:00 PM IST
క‌ర‌ణ్ జోహార్ ని ఫాలో అవుతున్న త‌రుణ్ భాస్క‌ర్...!
X
'పెళ్లి చూపులు' సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు త‌రుణ్ భాస్క‌ర్. తొలి సినిమాతోనే నేషనల్ అవార్డ్ కూడా అందుకున్నాడు. ఆ తర్వాత 'ఈ నగరానికి ఏమైంది' అంటూ మరో ప్రయోగాత్మక సినిమా చేసాడు. ఆ వెంటనే నటుడిగా మారి 'ఫలక్‌ నుమా దాస్' సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించి అందర్నీ షాక్ కి గురి చేసాడు. కొన్ని రోజుల్లోనే 'మీకు మాత్రమే చెప్తా' అంటూ హీరో అయిపోయాడు. ఇక ఇప్పుడు 'నేను మీకు చెప్తా' షో తో హోస్ట్ అయిపోయాడు తరుణ్ భాస్కర్. ద‌ర్శ‌కుడిగా.. ర‌చ‌యిత‌గా.. నటుడిగా.. మంచి గుర్తింపును సొంతం చేసుకున్న యంగ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ త‌రుణ్‌ భాస్క‌ర్ ఇప్పుడు 'మ‌నిషి బ్ర‌తుకు ఇంతే' వెబ్ సిరీస్ కోసం సింగర్ అవతారం కూడా ఎత్తాడు. దర్శకుడిగా మొదటి సినిమాతోనే నిరూపించుకున్న తరుణ్ భాస్కర్ అదే ఫీల్డ్ లో కంటిన్యూ అవకుండా తనకున్న మల్టీ టాలెంట్స్ అన్నీ బయటకి తీస్తున్నాడు. డ‌బ్బులు కోసం కాకుండా త‌న‌ను త‌ట్టి లేపే పాయింట్ కోసం వెయిట్ చేస్తూ.. ఆ పాయింట్ మైండ్ లోకి వచ్చినపుడే సినిమా చేస్తానంటున్నాడు మన 'పెళ్లి చూపులు' డైరెక్ట‌ర్. నిజానికి టాలీవుడ్ లోని యంగ్ హీరోలందరూ తమ కోసం స్టోరీ రెడీ చేయమని తరుణ్ ని రిక్వెస్ట్ చేసారు కూడా. అయితే మన డైరెక్టర్ కమ్ రైటర్ కమ్ హీరో కమ్ సింగర్ తరుణ్ భాస్కర్ వారి రిక్వెస్ట్ ని పక్కన పెట్టి నా స్టోరీకి సూట్ అయ్యేవాళ్ళతోనే నేను సినిమా తీస్తా అని సున్నితంగా తిరస్కరించాడట.

తరుణ్ భాస్కర్ ని చూస్తుంటే బాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ క‌ర‌ణ్ జోహార్ గుర్తుకు రాక మానడు. ఎందుకంటే కరణ్ జోహార్ కూడా డైరెక్టరుగా.. రైటరుగా.. ప్రొడ్యూసర్ గా.. యాక్టర్ గా.. హోస్ట్ గా పలు అవతారాల్లో కనిపిస్తూ వస్తున్నాడు. దీన్ని బట్టి చూస్తుంటే త‌రుణ్ భాస్క‌ర్ క‌ర‌ణ్ జోహార్ ని ఫాలో అవుతున్నాడు అనిపిస్తుంది. అంతేకాకుండా ఈ బాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ కూడా కెరీర్ తొలినాళ్ల‌లో తరుణ్ భాస్కర్ లానే వాదించే వాడ‌ట‌. క‌ర‌ణ్ జోహార్ 'కాఫీ విత్ కరణ్' మాదిరిగా టీవీలో తరుణ్ యాంక‌రింగ్ కూడా స్టార్ చేశాడు. అయితే రెండు మూడు ఎపిసోడ్లు చేశాక ఈ షో షూటింగ్ ఆగిపోయింది. క‌రోనా లాక్ డౌన్ త‌రువాత మ‌ళ్లీ ఈ షో రీ స్టార్ట్ చేస్తారో లేదో కూడా డౌటే. ఎందుకుంటే అనుకున్నంత రీచ్ కి ఈ 'నేను మీకు చెప్తా' షో వెళ్ల‌లేక‌పోయిందని ట్రేడ్ వర్గాలవారు అంటున్నారు. అందుకే 'కాఫీ విత్ క‌ర‌న్' లో ఉన్న ఆస‌క్తిక‌ర‌మైన పాయింట్స్ కాపీ చేసి త‌న షో వాడుకోవాల‌ని త‌రుణ్ ప్లాన్ చేస్తున్నారట. మరి రాబోయే రోజుల్లో మన తరుణ్ భాస్కర్ లోని ఎన్ని యాంగిల్స్ చూపిస్తాడో వెయిట్ చేసి చూడాలి.