Begin typing your search above and press return to search.

సోషల్ మీడియా ట్రోల్స్ పై తరుణ్ భాస్కర్ ఏమన్నారంటే...?

By:  Tupaki Desk   |   3 July 2020 7:50 AM GMT
సోషల్ మీడియా ట్రోల్స్ పై తరుణ్ భాస్కర్ ఏమన్నారంటే...?
X
'పెళ్లి చూపులు' డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఇటీవల తనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్‌ కు‌ పాల్పడుతున్నట్లు.. అసభ్య పదజాలంతో వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని తరుణ భాస్కర్‌ ఇద్దరు వ్యక్తులపై సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల 'కప్పెల' అనే మళయాళ సినిమా చూసిన తరుణ్ భాస్కర్ ఆ సినిమాపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ ''నెట్ ఫ్లిక్స్ లో 'కప్పేల' సినిమా చూడండి.. తర్వాత నాకు థ్యాంక్స్ చెప్పండి. ఈ సినిమాలో హీరో పిచ్చోడిలా రీసౌండ్ చేస్తూ అరవడు.. అందరికంటే స్మార్ట్ గా తన డైలాగుల్లో సామెతలు చెప్పరు.. ఎక్సట్రీమ్ స్లో మోషన్ లో ఫిజిక్స్ ఫెయిల్ గాల్లో ఎగిరే ఫైట్లు చేయరు.. ప్రతి రెండు నిముషాలకోసారి హీరో రీ ఎంట్రీ ఉండదు.. లాస్ట్ టెన్ మినిట్స్ లో రాండమ్ గా ఫార్మర్స్ గురించో సైనికుల గురించో ఇండియా గురించో మెసేజ్ ఉండదు.. దీన్ని కూడా సినిమా అంటారు ఆ ఊర్లో'' అని పోస్ట్ పెట్టారు.

తరుణ్ భాస్కర్ కావాలని అలా పోస్ట్ చేసాడో లేదో అనేది తెలియదు కాని టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలోని సన్నివేశాలను ఉద్దేశిస్తూ తరుణ్ కామెంట్స్ ఉన్నాయని భావించిన హీరో అభిమానులు అతన్ని సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశారు. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' 'భరత్ అనే నేను' 'సరిలేరు నీకెవ్వరు' అనే సినిమాలపైనే తరుణ్ కామెంట్స్ చేశాడని మహేష్ ఫ్యాన్స్ పేరుతో తరుణ్ భాస్కర్ పై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో కామెంట్స్ వచ్చాయి. దీంతో తరుణ్ తనను ట్రోల్ చేసిన వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇదిలా ఉండగా ఓ ప్రముఖ ఆంగ్ల డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తరుణ్ దీనిపై స్పందించాడట. వారి ట్రోల్స్ కారణంగా డిప్రెషన్ కి గురైతే ఎలా అని ప్రశ్నించారట. హీరోలకు వారి ఫ్యాన్స్ పై కంట్రోల్ ఉండదని.. కొంతమంది హీరోలు అయితే అసలు వారిని పట్టించుకోరు.. వాటిపై ఏ విధంగాను స్పందించరని చెప్పుకొచ్చాడట. అనవసరంగా ఇలాంటి ఇష్యూలో కలుగజేసుకోడానికి ఇష్టపడరని తరుణ్ భాస్కర్ వెల్లడించారట. అయితే తన సినిమాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ సినిమా డైరెక్టర్ అయ్యుండీ ఇతర సినిమాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసి ఫ్యాన్స్ ని హార్ట్ చేయడం ఎందుకు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.