Begin typing your search above and press return to search.

100 తీసుకో.. టికెట్ ఇప్పించు.. 50 డిస్కౌంట్!

By:  Tupaki Desk   |   2 July 2019 4:02 PM GMT
100 తీసుకో.. టికెట్ ఇప్పించు.. 50 డిస్కౌంట్!
X
టాలీవుడ్ లో నవతరం దర్శకులు విభిన్నమైన చిత్రాలు రూపొందిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. తెలుగులో ఏదైనా ఒక కొత్త సినిమా వస్తుందంటే చాలు అన్ని భాషలవారి దృష్టి దానిపైనే ఉంటోంది. ఈమధ్య రిలీజ్ అయిన పలు చిన్న బడ్జెట్ సినిమాలు విజయం సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంటున్నాయి. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ'.. 'మల్లేశం' ఈమధ్య అందరినీ మెప్పించాయి. తాజాగా 'బ్రోచేవారెవరురా' కూడా విజయం సాధించింది.

ఈ సందర్భంగా 'బ్రోచేవారెవరురా' టీమ్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సక్సెస్ మీట్ కు దర్శకుడు తరుణ్ భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈమధ్య 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ' సినిమా ను చూసిన తర్వాత ప్రెస్ మీట్ లో విజయ్ తో కలిసి తరుణ్ చేసిన సందడి గుర్తుంది కదా.. ఇప్పుడు కూడా ఈ ఈవెంట్ లో తరుణ్ సందడి మామూలుగా లేదు. 'బ్రోచెవారెవరురా' దర్శకుడు వివేక్ ఆత్రేయకు ఒక వంద నోటు ఇచ్చి "బ్రోచేవారెవరురా కు టికెట్లు దొరకడం కష్టంగా ఉంది. అందుకే ఇంకా సినిమాను చూడలేదు. ఈ వంద తీసుకొని నాకు ఎక్కడైనా టికెట్ ఇప్పించు" అన్నాడు. టికెట్ 150 రూపాయలే కానీ తనకు వివేక్ ఆత్రేయ చాలా రోజుల నుండి పరిచయం కాబట్టి 50 రూపాయలు డిస్కౌంట్ ఇస్తాడని అన్నాడు. ఆ వంద నోటు తీసుకున్న వివేక్ ఆత్రేయ.. ఎక్కడ కావాలి.. ఏఎంబీ సినిమాస్ లో ఓకేనా?" అన్నాడు. "సరే రేపు 11 కు నా గ్యాంగును వేసుకొని వచ్చేస్తాను" అన్నాడు.

ఈ డిస్కషన్ జరిగే సమయంలో ప్రియదర్శి నవ్వుతూ ఉండడం చూసి వెంటనే తనపైకి ఫోకస్ షిఫ్ట్ చేశాడు. "ఈ మధ్య ఏ ఫంక్షన్ లో అయినా అతనే కనిపిస్తున్నాడు. మొన్నటి దాకా 'మల్లేశం' ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు. ఇప్పుడు బ్రోచేవారెవరురాను ప్రమోట్ చేస్తున్నాడు. అసలు దర్శి ఏ సినిమాకు ప్రమోట్ చేస్తున్నాడు ఆర్థం కావడం లేదు. నాకు ఇక్కడ ఉన్న మీడియావారు చాలామంది తెలుసు. దర్శి మైక్ అందుకోగానే 'వచ్చాడ్రా వీడు' అని వాళ్లు మొహాలు వేలాడేస్తున్నారు" అంటూ నవ్వులు పూయించాడు. బ్రోచేవారెవరురా దర్శకుడు తనకు చాలా రోజుల నుండి తెలుసని.. ఇది వివేక్.. అతని టీమ్ అందరూ పడ్డ కష్టానికి తగ్గ విజయమని అన్నాడు. ఇలానే ప్రతి శుక్రవారం తెలుగులో అద్భుతమైన సినిమాలు రావాలని..ప్యాన్ ఇండియా లెవెల్ లో మన గురించి గర్వించే విధంగా సినిమాలు ఉండాలని కోరుకుంటున్నానని శెలవు తీసుకున్నాడు.