Begin typing your search above and press return to search.

మీ మాటకు మ్యూజిక్ తో ఆన్సరిస్తా

By:  Tupaki Desk   |   28 Feb 2018 10:25 AM IST
మీ మాటకు మ్యూజిక్ తో ఆన్సరిస్తా
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ల కాంబినేషన్ లో ఇంతవరకు నాలుగు సినిమాలొచ్చాయి. ‘బృందావనం’.. ‘బాద్ షా’.. ‘రామయ్యా వస్తావయ్యా’.. ‘రభస’ వీళ్లిద్దరూ కలిసి పనిచేశారు. ఇందులో మొదటి రెండు సినిమాలు బాగానే ఆడాయి. ఎటొచ్చీ చివరి రెండు సినిమాలు అట్టర్ ఫ్లాపయ్యాయి. వీటిలో పాటలు కూడా ఏమంత గొప్పగా లేకపోవడం అభిమానులను నిరాశపరిచింది.

చాలాకాలం తరవాత తారక్ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించబోతున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. తమన్ - తారక్ కాంబినేషన్ అనగానే మొదట్లో అభిమానుల్లో కాస్తంత ఆందోళన కలిగింది. ఈమధ్య తమన్ వరస హిట్లతో.. వైవిధ్యమైన సంగీతంతో దూసుకుపోతుండడంతో ఈ సినిమాపై ఆశలు పెట్టుకుంటున్నారు. ఇదేవిషయం గురించి ఓ అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘‘ప్రస్తుతం మీరు ఉన్న ఫాంలో మీ నుంచి అద్భుతమైన సంగీతాన్ని ఆశిస్తున్నామని.. మా అంచనాలను అందుకునేలా సంగీతం అందించాలని’’ ట్విట్టర్ లో కోరాడు.

దీనికి తమన్ కూడా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యాడు. తన ట్వీట్ ను సేవ్ చేసుకోమ్మని సలహా ఇస్తూనే.. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో దీనికి తన సమాధానం ఇస్తానని రిప్లయ్ ఇచ్చాడు. ఫ్యాన్స్ దీనికోసం సిద్ధంగా ఉండాలనే కామెంట్ తో వారిలో ఉత్సాహాన్ని పెంచాడు. మరి తమన్ అభిమానులను ఏ రేంజిలో మెప్పిస్తాడో చూడాలంటే ఇంకొంతకాలం ఆగాలి.