Begin typing your search above and press return to search.

RC15 కోసం 7 పాటలు రెడీ చేస్తున్న థమన్..!

By:  Tupaki Desk   |   11 Sept 2021 10:00 PM IST
RC15 కోసం 7 పాటలు రెడీ చేస్తున్న థమన్..!
X
ప్రస్తుతం ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు ఎస్ఎస్ థమన్. 'కిక్' సినిమాతో శ్రోతలను కొత్త సౌండింగ్ అందించిన థమన్.. అప్పటి నుంచి వరుస బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ తో దూసుకుపోతున్నాడు. ముఖ్యంగా గత రెండేళ్లలో థమన్ ఉన్నంత బిజీగా మరో సంగీత దర్శకుడు లేదని చెప్పవచ్చు. టాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్న తమన్.. ప్రస్తుతం డజనుకు పైగా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. వీటిలో శంకర్ - రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా కూడా ఉంది.

శంకర్ దర్శకత్వం వహించిన 'బాయ్స్' మూవీతో తెరంగేట్రం చేసిన థమన్.. ఇప్పుడు ఆయన రూపొందించే సినిమాకు మ్యూజిక్ అందించే అవకాశం అందుకున్నాడు. ఈ ఛాన్స్ అందుకోడానికి 20 ఏళ్ళు పట్టిందని తాజాగా ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్ తెలిపారు. RC15 చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో శంకర్ వేరే ఆప్షన్ ఇవ్వడం లేదని.. తననే కావాలంటున్నారని దిల్ రాజు చెప్పగానే షాక్ అయ్యాయని థమన్ చెప్పారు. ఈ సందర్భంగా శంకర్-చరణ్ సినిమాలో 7 పాటలు ఉంటాయని.. ఇప్పటికే 3 సాంగ్స్ కంపోజ్ చేశానని సంగీత దర్శకుడు వెల్లడించారు.

ఈ మధ్య కాలంలో ఏడు పాటలు ఉన్న సినిమాలు చాలా తక్కువనే చెప్పాలి. శంకర్ మాత్రం ఇప్పుడు రామ్ చరణ్ కోసం 7 సాంగ్స్ ప్లాన్ చేస్తున్నారు. పాటలను విజువల్ వండర్ లా తీర్చిదిద్దే శంకర్.. థమన్ స్వరపరిచిన గీతాలను ఏ రేంజ్ లో తెరకెక్కిస్తారో చూడాలి. కాగా, చరణ్ - శంకర్ ప్రాజెక్ట్ ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. అంజలి - సునీల్ - శ్రీకాంత్ - జయరామ్ - నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. తిరు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ రాస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది.