Begin typing your search above and press return to search.

తలైవా ఔట్.. తలపతి ఇన్?

By:  Tupaki Desk   |   30 Dec 2020 2:30 AM GMT
తలైవా ఔట్.. తలపతి ఇన్?
X
తమిళ రాజకీయ తెరపై ఊహించని పరిణామం ఇది. ఎంతో ఊగిసలాట అనంతరం రాజకీయాల్లోకి వచ్చేస్తున్నానని ప్రకటించిన రజనీకాంత్.. అంతకు రెట్టింపు వేగంతో వెనక్కి వెళ్లిపోయారు. ‘తాను రాజకీయాల్లోకి రాలేకపోతున్నాను.. క్షమించండి’ అంటూ అభిమానులకు బహిరంగ లేఖ రాశారు. ఈ పరిణామంతో తమిళ పాలిటిక్స్ వేగంగా మారబోతున్నాయి. ఇప్పటికే రాజకీయాల్లో పాతుకుపోయిన వారితోపాటు.. ఈ మధ్యనే వచ్చినవారు, త్వరలో రావాలనుకుంటున్న వారందరూ తమ భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమయ్యారు.

రాజకీయాల్లోకి రాబోతున్నానని గత నెలలో ప్రకటించిన రజనీకాంత్.. తన పార్టీని కూడా రిజిస్టర్ చేయించారు. ‘మక్కల్ సేవై కర్చీ’ పేరుతో పార్టీని స్థాపించి తమిళనాడులో తనదైన ముద్రవేయాలని భావించారు. డిసెంబర్ 31 లేదా.. జనవరి 17న రజనీ తన పార్టీని ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. దీంతో దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. పార్టీ ప్రకటనకు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని ఫ్యాన్స్ సంతోష పడుతున్న వేళ వెలువడిన రజనీ తాజా నిర్ణయం.. వారికిి ఎంత మాత్రమూ మింగుడుపడట్లేదు.

నిజానికి.. జనవరి 17న ఎంజీఆర్ జయంతి సందర్భంగా పార్టీని ప్రకటించడానికి రజనీ సిద్ధమయ్యారు. ఈ క్రమంలో తాను ప్రస్తుతం నటిస్తున్న ‘అన్నాత్తే’ సినిమాను త్వరగా ముగించి, పార్టీ వ్యవహారాల్లో బిజీ అయిపోవాలని రజనీ ప్లాన్ చేసుకున్నారు. హైదరాబాద్ లో ఈ షూటింగ్ మొన్నటి వరకూ శరవేగంగా సాగింది. కానీ.. ఈ చిత్రీకరణ సమయంలోనే రజనీ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో హుటాహుటిన ఆయన్ను అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ డిశ్చార్జ్ అనంతరం రజనీ ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్లిపోయారు. అయితే.. తమిళనాడు వెళ్లిన రజనీ.. ఇక పార్టీ ప్రకటన పనుల్లో బిజీగా ఉంటాడని అందరూ భావిస్తుండగా.. ఎవ్వరూ ఊహించని ప్రకటన చేశారు రజనీ.

ఈ ప్రకటనతో తమిళ రాజకీయ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. ఇన్నాళ్లూ రజనీ ప్రభంజనం ఎలా ఉండబోతోంది? దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి? అంటూ.. ప్రధాన పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే సహా, కమల్ హాసన్, కెప్టెన్ విజయ్ కాంత్ తదితరులు తమవైన వ్యూహాల్లో మునిగిపోయారు. కానీ.. తాజా పరిణామంతో తమ ప్లాన్స్ మొత్త తుడిచేసి, కొత్త వ్యూహాలు రచించుకోవాల్సిన పరిస్థితి తమిళనాట నెలకొంది.

ఇదిలా ఉంటే.. ఈ పరిస్థితి మొత్తాన్ని తనకు అనువుగా ఉపయోగించుకునేందుకు ఇళయతలపతి విజయ్ ప్రయత్నిస్తున్నారన్నది హాట్ టాపిక్ గా మారింది. విజయ్ కూడా రాజకీయాల్లోకి రావడానికి కొంత కాలంగా చూస్తున్నారు. త్వరలో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసేందుకు ప్రయత్నిస్తున్నారనే వార్తలు కూడా వినిపించాయి. ఈ విషయమై ఇప్పటికే తన అభిమాన సంఘం ‘మక్కల్ ఇయక్కం’ నిర్వాహకులతో సమావేశమయ్యారు. ఆ సమయంలో ‘అభిమానులు తొందరపడొద్దు. వేచి చూద్దాం’ అని విజయ్ చెప్పారట. ఎన్నికలకు ఇంకా ఐదు నెలలు సమయం ఉండడంతో త్వరలో ఓ నిర్ణయం తీసుకుందామని అభిమానులతో అన్నాడట విజయ్.

కానీ.. ఇప్పుడు ఊహించని ఈ పరిణామంతో తన ప్రయత్నాలు వేగవంతం చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. తమిళ సినీ ఇండస్ట్రీలో రజనీకాంత్ తర్వాత.. ఆ స్థాయి అభిమానులను సొంతం చేసుకున్న ఈతరం నటుడు విజయ్. తమిళ్ ఇండస్ట్రీని ఏ1 గా పాలిస్తున్న రజనీ తర్వాత.. ఆ స్థానాన్ని భర్తీ చేసే సత్తా విజయ్ కే ఉందనే అభిప్రాయం విశ్లేషకుల్లో ఉంది. అయితే.. ఇప్పుడు రజనీ రాజకీయాల్లోకి ప్రవేశించకుండానే వెనుతిరగడంతో.. అందివచ్చిన ఈ అవకాశాన్ని రెండు చేతులా ఒడిసి పట్టుకుట్టునేందుకు తలపతి ప్రయత్నించే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యకమవుతోంది.

మరికొన్ని ఊహాగానాలు మరింత ముందుకు వెళ్లాయి. డిసెంబర్ 31వ తేదీన తలపతి విజయ్ తన పార్టీని కూడా ప్రకటించబోతున్నాడనే ప్రచారం సాగుతోంది. విజయ్‌ ఇప్పటికే ‘పీపుల్స్ మూమెంట్ పార్టీ’ పేరుతో ఎన్నికల సంఘం వద్ద రిజిస్ట్రేషన్ చేయించినట్టు సమాచారం. ఇప్పటికే తమిళనాడు సీఎం పళనిస్వాని కలిసిన విజయ్.. ఈ నెల 31న జయలలిత సమాధి దగ్గర తన పార్టీ పేరును ప్రకటించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని జోరుగా చర్చ సాగుతోంది. మరి, తీవ్ర ఉత్కంఠ రేపుతున్న తమిళనాడు రాజకీయాల్లో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి? విజయ్ నిర్ణయం ఎలా ఉండబోతోంది? అన్నది తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.