Begin typing your search above and press return to search.

ఫిల్మ్ ప్రొడక్షన్ లోకి తలసాని ఫ్యామిలీ.. నిజమేనా?

By:  Tupaki Desk   |   4 Jun 2020 10:40 AM IST
ఫిల్మ్ ప్రొడక్షన్ లోకి తలసాని ఫ్యామిలీ.. నిజమేనా?
X
తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. టాలీవుడ్ పెద్దలతో సన్నిహిత సంబంధాలను నెరుపుతున్నారు. ఇటీవల లాక్ డౌన్ తో ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులకు సొంత ఖర్చులతో నిత్యావసరాలు అందించి ఉదారత చాటుకున్నారు. టాలీవుడ్ తో తలసాని అనుబంధాన్ని పెంచుకుంటున్నారు. దీనివెనుక బలమైన కారణమే ఉందన్న ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.

త్వరలోనే మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కుటుంబ సభ్యులు సినిమా నిర్మాణం రంగంలోకి ప్రవేశించాలని యోచిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలను మంత్రికి చాలా సన్నిహితంగా ఉన్న నిర్మాత సి.కళ్యాణ్ వెల్లడించారు.

‘అల వైకుంఠపురం’ నిర్మాత ఎస్.రాధాకృష్ణతో పలువురు నిర్మాతలతో తలసాని కుటుంబానికి సన్నిహిత సంబంధాలున్నాయి. ఆ క్రమంలోనే సినిమా నిర్మాణ రంగంలోకి కూడా దిగాలని తలసాని ఫ్యామిలీ అనుకుంటున్నట్టు ప్రచారం సాగుతోంది. వచ్చే ఏడాది నుంచి సినిమాలు నిర్మించాలని యోచిస్తున్నారట..

తలసాని కుమారుడు సాయికిరణ్, అతడి కజిన్స్ కు సినిమాలపై ఆసక్తి ఉందట.. దీంతో వారి ప్రోత్సాహంతోనే సినీ నిర్మాణం వైపు అడుగులు పడుతున్నట్టు తెలిసింది.

ప్రస్తుతం ఆర్థిక మాంద్యం, కరోనా-లాక్ డౌన్ తో స్తంభించిన సినీ పరిశ్రమలో భారీగా డబ్బులు పెట్టి సినిమాలు తీసే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే ఈ అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని మందగించిన సమయంలో సినీ వ్యాపారంలోకి దిగాలని తలసాని ఫ్యామిలీ ఆలోచిస్తోందట.. ఇది నిజమేనా? కాదా? అన్నది మాత్రం అధికారికంగా తలసాని కుటుంబం స్పందించలేదు. నిర్ధారించలేదు. ఇప్పటిదాకా అయితే గాసిప్ గానే ఈ వార్త సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.