Begin typing your search above and press return to search.

షారూఖ్ `జ‌వాన్`లో ద‌ళ‌ప‌తి విజ‌య్?

By:  Tupaki Desk   |   25 Aug 2022 2:30 AM GMT
షారూఖ్ `జ‌వాన్`లో ద‌ళ‌ప‌తి విజ‌య్?
X
షారుఖ్ ఖాన్ పాన్ ఇండియా మూవీ `జ‌వాన్`లో త‌మిళ స్టార్ హీరో.. దళపతి విజయ్ అతిధి పాత్రలో కనిపించనున్నారా? అంటే అవున‌నే టాక్ వినిపిస్తోంది. ప్ర‌స్తుతం అభిమానుల్లో దీనిపై వాడి వేడి చ‌ర్చ సాగుతోంది. ఆ ఇద్ద‌రూ క‌లిసి ఉన్న ఓ ఫోటో వైరల్ గా మార‌డంతో ఇది నిజం అని అంతా న‌మ్మేస్తున్నారు! ఈ ఫోటోగ్రాఫ్‌ జవాన్ సెట్స్ నుండి లీకైంద‌ని అభిమానులు ఊహిస్తున్నారు. అయితే ఈ వార్త‌లో నిజం ఎంత‌? అన్న‌ది తెలియాలంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే.

బాద్ షా షారూఖ్ ఖాన్ కొన్ని వ‌రుస ప‌రాజ‌యాల త‌ర్వాత‌ బ‌లమైన కంబ్యాక్ కోసం సౌత్ దర్శ‌కుడు అట్లీతో క‌లిసి ప‌ని చేస్తున్న సంగ‌తి తెలిసిందే. `జ‌వాన్` అనేది ఈ మూవీ టైటిల్. ఇందులో సౌత్ అగ్ర‌నాయిక న‌య‌న‌తార క‌థానాయికగా న‌టిస్తుండ‌గా దీపిక అతిథి పాత్ర‌లో క‌నిపించ‌నుంది. ప్ర‌స్తుతం షారూక్- దీపిక‌ల‌పై జవాన్ షూటింగ్ సాగుతోంది. ఈ బృందం చెన్నైలో ఉన్నారు.

2023లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఇది ఒకటి. ఈ సినిమాలో షారూక్ ద్విపాత్రాభినయం చేయనున్నాడని కూడా వార్తలు వచ్చాయి. అయితే దాని గురించి ఎటువంటి నిర్ధారణ లేదు. ఇదిలా ఉండగా ఈరోజు దళపతి విజయ్ - షారుక్ ఖాన్ క‌లిసి ఉన్న ఓ ఫోటోగ్రాఫ్‌ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జవాన్ లో ద‌ళ‌ప‌తి విజయ్ కి కూడా ఒక అతిథి పాత్ర ఉందని భావించిన అభిమానులు త‌మ ఎగ్జ‌యిట్ మెంట్ ని ప్ర‌ద‌ర్శించ‌డానికి వెన‌కాడ‌డం లేదు.

ప్ర‌స్తుతం ఈ ఫోటో ఎంట‌ర్ టైన్ మెంట్ చానెళ్ల‌లో బిగ్ డిబేట్ కి తెర తీయ‌గా సోష‌ల్ మీడియాల్లో వైర‌ల్ గా మారింది. నిజానికి షారూఖ్ ఖాన్ - ద‌ళ‌పతి విజయ్ కలిసి పెద్ద తెరపై ఒకే ఫ్రేమ్ లో క‌నిపిస్తే ఆ దృశ్య‌మే వేరుగా ఉంటుంది. అభిమానుల‌కు అది క‌న్నుల పండుగ‌గా ఉంటుంది. అయితే వైరల్ అయిన ఆ ఫోటోగ్రాఫ్ నకిలీది. ఇది SRK -బాబా సిద్ధిఖీ ఇఫ్తార్ పార్టీ కి వెళ్లిన‌ప్ప‌టి ఫోటో.

దానిని ఎవరో మార్ఫింగ్ చేసి ఇలా విజ‌య్ ఫోటోని జోడించి రిలీజ్ చేశారు. కాబట్టి ప్రస్తుతానికి జవాన్ లో దళపతి విజయ్ కి అతిధి పాత్ర లేదనేది సుస్ప‌ష్ఠం. కానీ ఈ ఇద్దరు స్టార్లు క‌లిసి మునుముందు న‌టిస్తార‌నే ఆశిద్దాం. జవాన్ లో సునీల్ గ్రోవర్ - సన్యా మల్హోత్రా -ప్రియమణి త‌దిత‌రులు నటించారు. ఈ చిత్రం 2023 జూన్ 2న విడుదల కానుంది.

జవాన్ తో పాటు షారుఖ్‌ ఖాన్ ప‌లు భారీ చిత్రాల్లో న‌టిస్తున్నాడు. పఠాన్ - డుంకీ చిత్రాల్లో కనిపించనున్నారు. దీపికా పదుకొనే - జాన్ అబ్రహం ప‌ఠాన్ లో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ చిత్రం 25 జనవరి 2023న విడుదల కానుంది. రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వం వహించిన డుంకీ 2023 క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో తాప్సీ పన్ను కూడా ప్రధాన పాత్రలో నటించింది. స‌ల్మాన్ టైగ‌ర్ 3లోనూ షారూక్ అతిథి పాత్ర‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే.