Begin typing your search above and press return to search.

వారిసు.. ది బాస్ రిట‌ర్న్స్‌

By:  Tupaki Desk   |   21 Jun 2022 1:05 PM GMT
వారిసు.. ది బాస్ రిట‌ర్న్స్‌
X
త‌మిళ హీరోలు తెలుగు మార్కెట్ పై క‌న్నేసిన విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా త‌మిళ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ తొలి సారి తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఓ బైలింగ్వ‌ల్ మూవీని చేస్తున్నారు. స్టార్ డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. హీరో విజ‌య్ 66వ ప్రాజెక్ట్ గా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ప్ర‌తిష్టాత్మ‌క నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.

ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీ కీల‌క షెడ్యూల్ ని ఇటీవ‌లే హైద‌రాబాద్ లో పూర్తి చేశారు. 20 రోజుల పాటు జ‌రిగిన ఈ షెడ్యూల్ లో కీల‌క ఘ‌ట్టాల‌ని ప్ర‌ధాన తారాగ‌ణం పాల్గొన‌గా చిత్రీక‌రించారు. దీంతో ఈ మూవీకి సంబంధించిర కీల‌క షెడ్యూల్ ముగిసింది. ప్ర‌స్తుతం మ‌లి షెడ్యూల్ షూటిగ్ జ‌రుగుతోంది. ఇదిలా వుంటే తాజాగా మంగ‌ళ‌వారం చిత్ర బృందం ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ టైటిల్ ని ప్ర‌క‌టిస్తూ ఓ పోస్ట‌ర్ ని సోష‌ల్ మీడియా వేదిక‌గా విడుద‌ల చేసింది.

ఈ చిత్రానికి `వారిసు` అనే టైటిల్ ని ఖ‌రారు చేశారు. టైటిల్ కి `ది బాస్ రిట‌ర్న్స్` అని క్యాప్ష‌న్ ఇచ్చారు. బిజినెస్ మెన్ గెట‌ప్ లో హీరో విజ‌య్ బ్లేజ‌ర్ ధ‌రించి సీరియ‌స్ లుక్ లో క‌నిపిస్తున్న తీరు ఆక‌ట్టుకుంటోంది. `వారిసు` టైటిల్ తెలుగా లేక‌ త‌మిళా లేక రెండు భాష‌ల‌కు క‌ల‌పి ఒకే టైటిల్ ని పెట్టారా? అన్న‌దానిపై మేక‌ర్స్ క్లారిటీ ఇవ్వ‌లేదు.

ఏది ఏమైనా టైటిల్ మాత్రం కొత్త‌గా వుంది. త‌మిళ్‌, తెలుగు భాష‌ల‌కు క‌లిపి `బీస్ట్‌` టైటిల్ ని వాడిన‌ట్టుగానే ఈ టైటిల్ ని కూడా వాడ‌తారా? లేక తెలుగు వెర్ష‌న్ కు మ‌రో టైటిల్ ని ప్ర‌క‌టిస్తారా? అన్న‌ది వేచి చూడాల్సిందే.

ఈ మూవీకి గ‌త కొన్ని రోజులుగా `వార‌సుడు` అనే టైటిల్ వినిపించింది. విజ‌య్ ఫ్యాన్స్ కూడా ఈ టైటిల్ బాగుంద‌ని కామెంట్ లు కూడా చేశారు. అయితే మేక‌ర్స్ మాత్రం `వారిసు` అని టైటిల్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ని రిలీజ్ చేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ఇదే టైటిల్ ని తెలుగు వెర్ష‌న్ కి కూడా కంటిన్యూ చేస్తారా? లేక మ‌రో టైటిల్ ని ప్ర‌క‌టిస్తారా? అన్న‌ది వేచి చూడాల్సిందే. ఫ్యామిలీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న ఈమూవీలో ప్ర‌ధాన తార‌గ‌ణంగా కీల‌క న‌టీన‌టులు న‌టిస్తున్నారు.

ప్ర‌కాష్ రాజ్‌, శ‌ర‌త్ కుమార్‌, `కిక్` శ్యామ్‌, ప్ర‌భు, శ్రీ‌కాంత్‌, సంగీత‌, జ‌య‌సుధ‌, ఖుష్బూ, యోగిబాబు త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం త‌మ‌న్‌, కెమెరా కార్తీక్ ప‌ళ‌ని, ఎడిటింగ్ కె.ఎల్‌. ప్ర‌వీణ్‌, స్టోరీ, స్క్రీన్ ప్లే వంశీ పైడిప‌ల్లి, అహిషోర్ స‌ల్మ‌న్‌, హ‌రి, ద‌ర్శ‌క‌త్వం వంశీ పైడిప‌ల్లి.