Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ బయోపిక్ లాగా చెయ్యరు కదా?

By:  Tupaki Desk   |   25 Oct 2019 6:05 AM GMT
ఎన్టీఆర్ బయోపిక్ లాగా చెయ్యరు కదా?
X
బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ ప్రస్తుతం మూడు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. 'పంగా'.. 'ధాకడ్' తో పాటు జయలలిత బయోపిక్ 'తలైవి' లో కూడా నటిస్తోంది. 'తలైవి' షూటింగ్ ఇంకా ప్రారంభించలేదు కానీ ప్రీ ప్రొడక్షన్ జోరుగాసాగుతోంది. ఎఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని విష్ణు ఇందూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు జయలలిత పాత్రకు కంగనా పర్ఫెక్ట్ గా సూటయ్యేలా ప్రోస్థటిక్ మేకప్ చేయాలని.. అందుకు విదేశీ మేకప్ నిపుణుల సాయం తీసుకోవాలని 'తలైవి' టీమ్ మొదట్లోనే నిర్ణయించారు.

'కెప్టెన్ మార్వెల్' సినిమాకు పనిచేసిన ప్రోస్థటిక్ స్పెషలిస్ట్ జేసన్ కాలిన్స్ ఈ సినిమాకు పనిచేస్తారు. ఇప్పటికే ఒకసారి కంగనాకు లుక్ టెస్ట్ జరిగింది. రీసెంట్ గా కంగన సెకండ్ టైమ్ లుక్ టెస్ట్ కు హాజరయింది. కంగన తో పాటు 'తలైవి' టీమ్ సభ్యులు కూడా ఈపనిపైనే లాస్ ఏంజెలెస్ కు వెళ్ళారు. ఈ బృందంలో కంగన సోదరి రంగోలి.. కాస్ట్యూమ్ డిజైనర్ నీతా లుల్లా.. నిర్మాతలు విష్ణు ఇందూరి.. బృందా ప్రసాద్.. శైలేష్ షా కూడా ఉన్నారు. వర్క్ విషయంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తీరిక సమయం దొరికినప్పుడు అందరూ కలిసి సరదాగా గడుపుతూ ఫోటోలు తీయించుకున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బయటకు రావడంతో 'తలైవి' ప్రాజెక్టు ఫుల్ స్వింగ్ లో ఉందనే విషయం అందరికీ అర్థం అయింది.

ఇవంతా బాగానే ఉన్నాయి కానీ విష్ణు ఇందూరి టేకప్ చేసిన ఎన్టీఆర్ బయోపిక్ మొదట్లో భారీ ఆసక్తిని కలిగించింది. అయితే బయోపిక్ ను రెండు భాగాలుగా చేసి 'ఎన్టీఆర్ కథానాయకుడు'.. 'ఎన్టీఆర్ మహానాయకుడు' గా రిలీజ్ చేస్తే అవి ఒకదాన్ని మించి మరొకటి డిజాస్టర్ అయ్యాయి ఎన్టీఆర్ జీవితంలోని నెగెటివ్ అంశాలను పూర్తిగా మరుగుపరిచి బాకా ఊదడంతో ప్రేక్షకులు తిప్పికొట్టారు.

ఇప్పుడు 'తలైవి' సినిమాతో కూడా సేమ్ ప్రాబ్లెం వచ్చే అవకాశం ఉంది. ఎన్టీఆర్ జీవితంలో ఉన్నట్టే జయలలిత జీవితంలో భారీ విజయాలతో పాటు ఎన్నో వివాదాస్పద అంశాలు ఉన్నాయి. కొన్నిటికి తెరపైన చూపించడం కత్తిమీద సాము లాంటిది. ఎంజీఆర్-జయ బంధం.. జయ - శశికళ బంధం అందులో మచ్చుకు కొన్ని. ఇక అవినీతి ఆరోపణలు లాంటి ఎన్నో ఇతర అంశాలు కూడా ఉన్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ తరహాలో ఈ సినిమాలో కూడా 'అమ్మ' భజన చేస్తే మాత్రం మరోసారి నిర్మాతలకు షాక్ తప్పదు.