Begin typing your search above and press return to search.

'వకీల్ సాబ్' డిస్ట్రిబ్యూటర్లలో టెన్షన్

By:  Tupaki Desk   |   24 March 2021 5:00 PM IST
వకీల్ సాబ్ డిస్ట్రిబ్యూటర్లలో టెన్షన్
X
కరోనా బ్రేక్ తర్వాత టాలీవుడ్ నుంచి రాబోతున్న తొలి భారీ చిత్రం 'వకీల్ సాబ్'. గత మూణ్నాలుగు నెలల్లో వచ్చిన సినిమాలన్నీ మీడియం రేంజివే. వేసవి వినోదానికి శ్రీకారం చుడుతున్న 'రంగ్ దె', 'అరణ్య' సినిమాలు కూడా ఆ స్థాయివే. ఏప్రిల్ 9న రాబోయే 'వకీల్ సాబ్' కరోనా విరామానంతరం రాబోతున్న తొలి భారీ చిత్రం కావడంతో దానిపై అందరి దృష్టీ నిలిచి ఉంది. క్రాక్, ఉప్పెన, జాతిరత్నాలు సినిమాలకు థియేటర్లు హౌస్ ఫుల్స్ అయ్యాయి.. బాక్సాఫీస్ దగ్గర బాగానే సందడి నెలకొంది. కానీ పవన్ సినిమా రిలీజవుతుంటే ఉండే యుఫోరియా వేరన్నది అందరికీ తెలిసిందే. ఇది 'పింక్' రీమేక్ కావడం వల్ల సినిమా పట్టాలెక్కినపుడు బజ్ తక్కువగానే ఉంది కానీ.. ఆ తర్వాత ఈ చిత్రంలో పవన్ అభిమానులు ఆశించే అంశాలకేమీ లోటు లేదని తేలడంతో ఆటోమేటిగ్గా హైప్ పెరిగింది. దాదాపు వంద కోట్లకు ఈ సినిమా థియేట్రికల్ హక్కులు అమ్ముడు కావడం విశేషం. బయ్యర్లు భారీగానే పెట్టుబడులు పెట్టేశారు.

పవన్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే బయ్యర్ల పంట పడుతుంది. అదే సమయంలో నెగెటివ్ టాక్ వస్తే బాగా దెబ్బ పడుతుంది. సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు, అజ్ఞాతవాసి సినిమాల విషయంలో ఇదే జరిగింది. అయినప్పటికీ పవన్ రీఎంట్రీ మూవీ కావడంతో 'వకీల్ సాబ్' విషయంలో బయ్యర్లు వెనుకంజ వేయలేదు. బాక్సాఫీస్ దగ్గర ఆశాజనక పరిస్థితి కనిపిస్తుండటంతో కరోనా బ్రేక్ తర్వాత రాబోయే తొలి భారీ చిత్రానికి భారీగా వసూళ్లు ఉంటాయన్న ఆశాభావంతో ఉన్నారు. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా ప్రభావం పెరుగుతుండటం, మళ్లీ ఆంక్షలు విధించే పరిస్థితి కనిపిస్తుండటంతో 'వకీల్ సాబ్' బయ్యర్లలో గుబులు రేగుతోంది.

తెలంగాణలో థియేటర్లు మూసి వేయాలని అధికార వర్గాల నుంచి సిఫార్సులు రాగా.. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అలాంటిదేమీ లేదని స్పష్టత ఇచ్చారు. కానీ రాబోయే రోజుల్లో కరోనా తీవ్రత పెరిగితే ఏం జరుగుతుందో చెప్పలేం. ఈ సినిమాకు పెట్టుబడులు వెనక్కి తెచ్చుకోవాలంటే అదనపు షోలు, బెనిఫిట్ షోలు వేయాల్సిందే. ఏపీలో మామూలుగా ఇలా పెద్ద సినిమాలకు అదనపు, బెనిఫిట్ షోలకు అనుమతులు లాంఛనమే. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అవి సందేహంగా మారుతున్నాయి. రాజకీయ ప్రత్యర్థి అయిన పవన్‌ను ఇబ్బంది పెట్టడానికి.. ప్రభుత్వం కరోనానకు కారణంగా చూపి ఈ సినిమాకు ప్రతికూలంగా నిర్ణయాలు తీసుకుంటుందేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఏప్రిల్ 9న నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి.