Begin typing your search above and press return to search.

‘టెంపర్’నూ చెడగొట్టినట్లున్నారే..

By:  Tupaki Desk   |   3 Dec 2018 9:00 AM GMT
‘టెంపర్’నూ చెడగొట్టినట్లున్నారే..
X
దక్షిణాది కథలు బాలీవుడ్ కు వెళ్లడం ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైంది. గత కొన్నేళ్లలో చాలా సినిమాలే హిందీలో రీమేక్ అయ్యాయి. ఐతే ఇక్కడి సినిమాల్ని బాలీవుడ్ జనాలు ఉన్నదున్నట్లుగా ఎప్పుడూ రీమేక్ చేయరు. మూల కథ తీసుకుని ట్రీట్మెంట్ పూర్తిగా మార్చేస్తుంటారు. ‘వర్షం’.. ‘కిక్’.. ‘క్షణం’ లాంటి సినిమాల హిందీ రీమేక్‌ లను చూసి మనవాళ్లు షాకైపోయారు. పేరుకే రీమేక్ కానీ.. అసలు ఒరిజినల్స్‌ లోని ఫీల్ పూర్తిగా మిస్సయిపోయింది హిందీలో. ‘కిక్’ విషయంలో సురేందర్ రెడ్డి తన అసంతృప్తిని బహిరంగంగా వెళ్లగక్కాడు కూడా. ఇక ‘క్షణం’ లాంటి టాప్ క్లాస్ థ్రిల్లర్ని ఎంతగా చెడగొట్టాలో అంతగా చెడగొట్టారు అక్కడి జనాలు. ఈ కోవలోనే ‘టెంపర్’ను కూడా నాశనం చేసినట్లుగా అనిపిస్తోంది.. దీని రీమేక్ ‘సింబా’ ట్రైలర్ చూస్తే.

సోషల్ కాజ్ ఉన్న బలమైన కథను మంచి ఇంటెన్సిటీతో చెప్పాడు పూరి జగన్నాథ్. సినిమా అంతటా ఒక ఇంటెన్సిటీ కనిపిస్తుందందులో. మామూలుగా పూరి అంటే ఎక్కువగా వినోదం మీద దృష్టిపెడతాడు. అల్లరి చిల్లరి సీన్లు పెడతాడు. దీంతో ఆ డోస్ బాగా తగ్గించాడు. ఆ కథను ఎలా చెప్పాలో అలా చెప్పాడు. కానీ హిందీలో మాత్రం ‘టెంపర్’ను కామెడీ చేసి పారేసినట్లున్నారు. ఈ చిత్రాన్ని ఒక రెగ్యులర్ మాస్ మసాలా సినిమాలా డీల్ చేశాడు రోహిత్ శెట్టి. అతడి స్టయిల్లో మరీ లౌడ్‌ గా.. మాసీగా ఉంది సినిమా. ‘టెంపర్’ చూసిన వాళ్లు ‘సింబా’ ట్రైలర్ చూసి బెంబేలెత్తిపోతున్నారు. ఒరిజినల్‌లో ఉన్న ఫీల్.. ఇంటెన్సిటీ ఎంతమాత్రం ఇందులో లేదు. ఇంతకుముందు రోహిత్ శెట్టి తీసిన ‘సింగం’ రీమేక్ కు దీనికి లింక్ పెట్టడం.. దానికిది సీక్వెల్ లాగా ప్రొజెక్ట్ చేయడం కూడా ఏమీ బాగా లేదు. ‘టెంపర్’తో పోలిస్తే ఇందులో భారీతనం కనిపిస్తోంది కానీ.. అందులోని ఇంటెన్సిటీ మాత్రం పూర్తిగా మిస్సయినట్లే ఉంది. రణ్వీర్ సింగ్-సారా అలీ ఖాన్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మించాడు. డిసెంబరు 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది.