Begin typing your search above and press return to search.

ప్రముఖ నటుడు వైజాగ్ ప్రసాద్ హఠాన్మరణం

By:  Tupaki Desk   |   21 Oct 2018 11:06 AM IST
ప్రముఖ నటుడు వైజాగ్ ప్రసాద్ హఠాన్మరణం
X
ప్రముఖ సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ వైజాగ్ ప్రసాద్(75) కన్నుమూశారు. 50కి పైగా చిత్రాల్లో ఆయన నటించారు. ఏ పాత్రలోనైనా ఒదిగిపోయే లక్షణం ఆయనది. ఆయన మృతికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) సంతాపాన్ని తెలియజేసింది. వైజాగ్ ప్రసాద్ కుటుంబ సభ్యులకు మా అధ్యక్షుడు శివాజీ రాజా ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ప్రసాద్ స్వస్థలం వైజాగ్ లోని గోపాల్ పురం. సీరియల్ నటుడిగా తన కెరీర్ ప్రారంభించారు. ఈయన అసలు పేరు కొర్లాం పార్వతీ వరప్రసాదరావు. చదువుకునే రోజుల నుంచే పలు నాటకాల్లో నటించారు. నాటకాల్లో ఉన్న పిచ్చితోనే చదువులోనూ వెనుకబడినట్లు ఆయన ఒకానొక సందర్భంలో తెలియజేశారు.

జంధ్యాల దర్శకత్వం వహించిన ‘‘బాబాబ్ అబ్బాయ్’’ సినిమాలో ప్రసాద్ మొదటి సారిగా నటించారు. ప్రేక్షకులకు బాగా దగ్గరైన సినిమా తేజ దర్శకత్వం వహించిన ‘నువ్వు నేను’. ఇందులో ధనవంతుడైన తండ్రి పాత్రలో ఆయన ఒదిగిపోయారు. జై చిరంజీవ సినిమాలో వైద్యుడిగా, భూమిక తండ్రిగా నటించారు. ఇంకా - భద్ర - శ్రీరామ్ - లయన్ - ఫిట్టింగ్ మాస్టర్ - జానకి వెడ్స్ శ్రీరామ్ - గౌరి తదితర చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రలలో ఒదిగిపోయారు.

ప్రసాద్ కు భార్య విద్యావతి - ఇద్దరు పిల్లలు రత్నప్రభ - రత్నకుమార్ ఉన్నారు. కూతరు అమెరికాలో నివాసం ఉండగా, అబ్బాయి లండన్ లో ఉంటున్నాడు. మరణ వార్త విని వారు వైజాగ్ కు పయనమయ్యారు.