Begin typing your search above and press return to search.

కోలీవుడ్ జనాలు టాలీవుడ్ సినిమాలని ఎందుకు పట్టించుకోవడం లేదు...?

By:  Tupaki Desk   |   19 April 2020 4:00 AM IST
కోలీవుడ్ జనాలు టాలీవుడ్ సినిమాలని ఎందుకు పట్టించుకోవడం లేదు...?
X
ప్రస్తుతం టాలీవుడ్ మార్కెట్ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు మన స్టార్ హీరోలు ప్రతి సినిమాని పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు. రాజమౌళి తీసిన 'బాహుబలి' సినిమాల తర్వాత అన్ని ఇండస్ట్రీలు మనవైపు చూస్తున్నాయనడంలో సందేహం లేదు. ఒకప్పుడు కేవలం సౌత్ కే పరిమితమైన మన సినిమాలు ఇప్పుడు బాలీవుడ్ లో కూడా సత్తా చాటుతున్నాయి. అయితే ఒక్క కోలీవుడ్ లో మాత్రం మన సినిమాలకు అంతగా ఆదరణ దక్కడం లేదని చెప్పవచ్చు. మన దగ్గర ఇండస్ట్రీ రికార్డ్స్ ని తిరగ రాసిన 'మగధీర' 'రంగస్థలం' 'శ్రీమంతుడు' లాంటి సినిమాలని అక్కడి ప్రేక్షకులు తిరస్కరించారు. కానీ తమిళ హీరోల సినిమాలను టాలీవుడ్ ప్రేక్షకులు బాగా ఆదరిస్తూ వస్తున్నారు. రజినీకాంత్, కమల్ హాసన్, సూర్య, అజిత్, విజయ్, విక్రమ్, విశాల్, ధనుష్, కార్తీ లాంటి హీరోల చిత్రాలకు ఇక్కడ కూడా మంచి మార్కెట్ ఉంది. సినిమా విడుదల సమయంలో తెలుగు వాళ్ళ కోసం స్పెషల్ గా ప్రమోషన్స్ చేసుకుంటారు తమిళ హీరోలు. వారి సినిమాలు ఇక్కడ రిలీజ్ అవుతున్నాయంటే ఎగబడి చూస్తారు మన తెలుగు ప్రేక్షకులు. సినిమా బాగుంది అంటే చాలు మన హీరోలు సోషల్ మీడియాలో వారి సినిమాలకి ఫ్రీగా ప్రమోషన్స్ కూడా చేసి పెడుతుంటారు.

కానీ మన సినిమాలు అక్కడ రిలీజ్ అయితే తమిళియన్స్ మాత్రం మన సినిమాలను పెద్దగా కేర్ చేయరు. ఒకటి అర సినిమాలు తప్ప అక్కడ పెద్దగా ఆడిన తెలుగు సినిమాలు లేవు. అక్కడ ఒక్క హీరో కూడా మన తెలుగు వాళ్ళ సినిమా రిలీజ్ అయితే ఒక ట్వీట్ కూడా వేయరు. అక్కడి అగ్ర హీరోలకు మన తెలుగులో ఉన్న డిమాండ్.. మన తెలుగు హీరోలకు అక్కడ ఉండటం లేదు. కంటెంట్ వైజ్ చూసుకున్నా ఇప్పుడు మన చిత్రాలు ఏ ఇండస్ట్రీకి తీసిపోవడం లేదు. నేషనల్ అవార్డ్స్ గెలిచే స్థాయిలో ఉంటున్నాయి. మరి తమిళనాట మన సినిమాలని ఎందుకు చూపు చూస్తున్నారో వాళ్లకే తెలియాలి. దీనికి స్పష్టమైన కారణం ఏంటీ అనేది తెలియకపోయినా.. మన తెలుగు సినిమాలు వాళ్ళ మీద ఎక్కువగా ఆధారపడుతున్నాయి అనే భావనలో వాళ్ళు ఉండటమే అని కొంతమంది అంటున్నారు. కమర్షియల్ మార్కెట్ కోసం తమిళ హీరోలను మన తెలుగు సినిమాల్లోకి విలన్ గా సహా ఇతర సహాయ పాత్రల కోసం ఎంపిక చేస్తూ వస్తున్నారు. దీని వలన వాళ్ళ ఇండస్ట్రీ మీద డిపెండ్ అయి ఉన్నామనే ఫీలింగ్ వాళ్లలో ఉంటోందట.

ఈ పరిస్థితి ఇప్పుడు కొత్తగా వచ్చిందేమీ కాదు. తమిళ రాష్ట్రము నుండి తెలుగు వాళ్ళు విడిపోయినప్పటి నుండి వస్తూనే ఉంది. అయితే మన సినిమాల మార్కెట్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండటం కూడా ఒక కారణమని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. పాన్ ఇండియా వైడ్ దూసుకుపోతున్న మన సినిమాల ఎదుగుదల ఇష్టంలేక పోవడం వలన కూడా కోలీవుడ్ జనాలు మన సినిమాల్ని పట్టించుకోవడం లేదనే ఆరోపణ కూడా ఉంది. ఏదేమైనా టాలీవుడ్ ఇప్పుడు మార్కెట్ పరంగా కోలీవుడ్ ని బీట్ చేస్తున్నది అనడంలో సందేహం లేదని చెప్పవచ్చు.