Begin typing your search above and press return to search.

రీమేకుల వెంట పెరుగుతున్న పరుగులు!

By:  Tupaki Desk   |   10 May 2021 5:00 PM IST
రీమేకుల వెంట పెరుగుతున్న పరుగులు!
X
తెలుగులో భారీ విజయాలను సాధించిన సినిమాలు ఇతర భాషల్లోకి రీమేక్ కావడం, ఇతర భాషల్లో ఘన విజయాలు అందుకున్న సినిమాలు తెలుగులోకి రీమేక్ చేయడం చాలా కాలం నుంచి జరుగుతున్నదే. అయితే గతంలో హిట్ టాక్ తెచ్చుకున్న ఒక సినిమా మరో భాషలోకి రీమేక్ కావడానికి కొంత సమయం పట్టేది. కానీ ఇప్పుడు అంత సమయం పట్టడం లేదు. ఒక భాషలో విజయాన్ని సాధించిన సినిమా, చాలా తక్కువ సమయంలో ఇతర భాషల్లో రీమేకులుగా దిగిపోతున్నాయి.

తెలుగు హీరోలంతా కూడా ఇటీవల కాలంలో రీమేక్ లపై ఎక్కువ దృష్టి పెట్టారు. దాదాపు అందరి హీరోలకు సొంత బ్యానర్లు ఉన్నాయి. అందువలన అవతల భాషలో ఒక సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తే చాలు, ఆ సినిమా హక్కులపై కర్చీఫ్ వేసేస్తున్నారు. ఈ హక్కుల కోసం పోటీ చాలా గట్టిగా ఉన్నప్పటికీ, బరిలో నుంచి వెనుదిరగకుండా భారీ రేటుకు రీమేక్ హక్కులను హాట్ కేకుల్లా కొనేస్తున్నారు. రీమేక్ వలన కథపై గట్టి నమ్మకం కుదురుతుంది. తమ బాడీ లాంగ్వేజ్ కి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది ముందుగానే తెలిసిపోతుంది. బడ్జెట్ విషయంలోను ఒక క్లారిటీ ఉంటుంది.

అందువలన హీరోలంతా కూడా రీమేక్ సినిమాలు చేయడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న 'ఆచార్య' పూర్తి కాగానే, చిరంజీవి 'లూసిఫర్' రీమేక్ లో చేయనున్నారు. మలయాళంలో మోహన్ లాల్ కి సక్సెస్ తో పాటు ప్రశంసలు తెచ్చిపెట్టిన సినిమా ఇది. మోహన్ రాజా దర్శకత్వంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక వెంకటేశ్ 'అసురన్' రీమేక్ గా 'నారప్ప' .. 'దృశ్యం 2' రీమేక్ ను అదే పేరుతో పూర్తిచేసేశారు. ఈ రెండు సినిమాలు విడుదలకు ముస్తాబవుతున్నాయి. 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్ లో పవన్ - రానా, 'అంధాదున్' రీమేక్ లో నితిన్ చేస్తున్నారు. ఇక 'కర్ణన్' రీమేక్ చేసే ఆలోచనలో బెల్లంకొండ శ్రీనివాస్ ఉన్నాడు. మొత్తానికి తెలుగు తెరపై వరుస రీమేకులు పరుగులు పెట్టనున్నాయన్న మాట!