Begin typing your search above and press return to search.

అమెరికా అంత‌రిక్ష యాత్ర‌లో తెలుగు యువ‌తి.. సంబ‌రాల్లో బండ్ల గ‌ణేష్!

By:  Tupaki Desk   |   2 July 2021 8:50 PM IST
అమెరికా అంత‌రిక్ష యాత్ర‌లో తెలుగు యువ‌తి..  సంబ‌రాల్లో బండ్ల గ‌ణేష్!
X
అమెరికాకు చెందిన 'వ‌ర్జిన్ గెలాక్టిక్‌' అనే సంస్థ.. అంతరిక్ష యాత్ర‌ను చేప‌ట్టబోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ టూర్లో ఓ తెలుగు యువ‌తి కూడా ఉంది. భార‌త సంత‌తికి చెందిన ఆ యువ‌తిపేరు శిరీష బండ్ల. వ‌ర్జిన్ గెలాక్టిక్ సంస్థ‌లో ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాల ఉపాధ్య‌క్షురాలిగా ఉన్న ఆమె.. ఈ స్పేస్ టూర్ లో పాల్గొంటున్నారు.

అంత‌రిక్ష ప‌ర్యాట‌కాన్ని ప్రోత్స‌హించేందుకే వ‌ర్జిన్ గెలాక్టిక్ అనే సంస్థ ఈ టూర్ ప్లాన్ చేసింది. స్పేస్ లోకి ప్ర‌యాణికుల‌ను తీసుకెళ్లేందుకు ఇప్ప‌టికే ఈ కంపెనీ లైసెన్స్ కూడా తీసుకుంది. వ‌ర్జిన్ గెలాక్టిక్‌ కంపెనీకి జూన్ 25వ తేదీనే.. ఫెడ‌ర‌ల్ ఏవియేష‌న్ అడ్మినిస్ట్రేష‌న్ సిబ్బంది అనుమ‌తి మంజూరు చేశారు. వర్జిన్ గెలాక్టిక్ సంస్థ చేప‌డుతున్న నాలుగో అంత‌రిక్ష‌యానం ఇది. అయితే.. ప్ర‌యాణికుల‌ను తీసుకెళ్ల‌డం మాత్రం ఇదే తొలిసారి.

ఈ టీమ్ లో మొత్తం ఆరుగురు ఉన్నారు. వీరిలో ఇద్ద‌రు పైలెట్లు కాగా.. మ‌రో ముగ్గురు స్పేస్ సెష‌లిస్టులు. మిగిలిన ఒక‌రు బిలియనీర్‌. ఈ ఆరుగురు ఎవ‌రంటే.. శిరీష బండ్ల‌, కెల్లి ల్యాటిమ‌ర్‌, స్ట‌ర్ కోవ్‌, డేవ్ మెక్ కే, మైఖేల్ మ‌సూక్కీ, బ్రాస్న‌న్. వీరిలో బ్రాస్న‌న్ సంప‌న్నుడి హోదాలో నింగిలోకి ఎగ‌ర‌బోతున్నారు. ఈ యాత్ర పూర్త‌యితే.. తొలిసారి స్పేస్ లోకి వెళ్లివ‌చ్చిన ప్రైవేటు వ్య‌క్తిగా చ‌రిత్ర సృష్టించ‌బోతున్నారు.

ఈ టీమ్ లో ఉన్న శిరీష బండ్ల గుంటూరు జిల్లా తెనాలికి చెందిన‌ యువ‌తి. ఆమె కుటుంబం అమెరికాలో స్థిర‌ప‌డింది. వ‌ర్జిన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాల‌ను ప‌ర్య‌వేక్షించే విభాగానికి ఉపాధ్య‌క్షురాలిగా ఉన్నారు. ఆ విధంగా ఈ స్పేస్ టూర్ కు వెళ్లే అవ‌కాశం ద‌క్కింది. దీంతో.. తెలుగువారంతా ఆమెకు శుభాకాంక్ష‌లు చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలో సినీ న‌టుడు, నిర్మాత బండ్ల గ‌ణేష్ సోష‌ల్ మీడియాలో ట్వీట్ చేశారు. ''శిరీష బండ్ల అంత‌రిక్షంలో వెళ్తుండ‌డం ఎంతో గ‌ర్వంగా ఉంది'' అని ట్వీట్ చేశారు. దీంతో.. ఆ శిరీష కుటుంబానికీ, బండ్ల గ‌ణేష్ కు ఉన్న రిలేష‌న్ ఏంట‌ని ఆరాతీస్తున్నారు. ఒకే ఇంటి పేరు ఉంది కాబ‌ట్టి ట్వీట్ చేశారా? నిజంగానే రెండు కుటుంబాల మ‌ధ్య బంధుత్వం ఉందా? అని చ‌ర్చించుకుంటున్నారు.