Begin typing your search above and press return to search.

తూతూగానే నిర్మాత‌ల మండ‌లి ఎల‌క్ష‌న్!

By:  Tupaki Desk   |   30 Jun 2019 6:59 PM IST
తూతూగానే నిర్మాత‌ల మండ‌లి ఎల‌క్ష‌న్!
X
తెలుగు సినీ నిర్మాతల మండలి(టీఎఫ్‌ పీసీ) ఎన్నికల గురించి గ‌త కొంత‌కాలంగా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు తొమ్మిదేళ్ల త‌ర్వాత‌ ఈ ఎన్నిక‌లు జ‌రుగుతుండ‌డం.. నిర్మాత‌ల గిల్డ్ పేరుతో స్టార్ ప్రొడ్యూస‌ర్లు అంతా కొత్త సంఘం స్థాపించి బ‌య‌ట‌కు వెళ్లిపోవ‌డంతో కొత్త‌గా కొలువుదీరే మండ‌లి ఏం వెల‌గ‌బెడుతుంది? అంటూ పెద‌వి విరుపులు వినిపించాయి. ఈసారి అధ్య‌క్షుడు ఎవ‌రు? ఎన్నిక‌లు తూతూగానే సాగుతాయా? అంటూ ఆస‌క్తిగా మాట్లాడుకున్నారు. 50 మంది గిల్డ్ మెంబ‌ర్స్ లేక‌పోవ‌డంతో అందుకు త‌గ్గ‌ట్టే ఈసారి నిర్మాత‌ల మండ‌లి ఎన్నిక‌లు చాలా చ‌ప్ప‌గా సాగుతాయ‌నే ముందే అంచ‌నా వేసారు. అందుకు త‌గ్గ‌ట్టే నేటి (జూన్ 30) ఎల‌క్ష‌న్ ఆద్యంతం ఎలాంటి సంద‌డి లేకుండా చ‌ప్ప‌గానే సాగింది. ఈ ఎన్నికల్లో సి. కళ్యాణ్ ప్యానల్ పై పి. రామకృష్ణ గౌడ్ ప్యానల్ తలపడ‌గా.. అధ్యక్షపదవికి సి. కళ్యాణ్ - రామకృష్ణగౌడ్ పోటీపడ్డారు. ఉపాధ్యక్ష పదవికి వైవియస్ చౌదరి, అశోక్ కుమార్, నట్టికుమార్ వంటి వారు పోటీ పడ్డారు. మండ‌లిలో మొత్తం 1200 పైగా ఓట్లు వున్నాయి. ఎన్నికలు మధ్యాహ్నం 2 గంటలకు ముగియ‌గా... ఇప్ప‌టికే అధ్య‌క్షుడి గెలుపును ఖాయం చేశారు.

ఈసారి మండ‌లి కొత్త అధ్య‌క్షుడిగా సి.క‌ళ్యాణ్ 378 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే పూర్తి రిజ‌ల్ట్ తేలాల్సి ఉంది. ఇక‌పోతే ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులుగా ఈసారి టి.ప్ర‌స‌న్న‌కుమార్, మోహ‌న్ వ‌డ్ల ప‌ట్ల ఏక‌గ్రీవం అయ్యార‌ని తెలుస్తోంది. త‌దుప‌రి ఉపాధ్య‌క్షులు.. ట్రెజ‌ర‌ర్ గా ఎవ‌రు ఎన్నిక‌య్యారు? అన్న‌ది తెలియాల్సి ఉంది. ఇక కార్య‌వ‌ర్గం 15 మంది ఉండాల్సి ఉండ‌గా కేవ‌లం 19 మంది పోటీప‌డ్డార‌ని స‌మాచారం. ఎన్నిక‌ల‌కు సంబంధించిన రిజ‌ల్ట్ ని సి.క‌ళ్యాణ్ నేటి సాయంత్రం మీడియా ముఖంగా ప్ర‌క‌టించ‌నున్నార‌ని తెలుస్తోంది.

మొత్తానికి ఈసారి ఎన్నిక‌లు కేవ‌లం తూతూ మంత్రమేన‌న్న‌ చర్చ సాగుతోంది. ఎల్‌.ఎల్‌.పి వాళ్లు గిల్డ్ పేరుతో మండ‌లి నుంచి విడిపోయాక సి.క‌ళ్యాణ్ పెద్ద‌రికం నెరిపి అంద‌రినీ క‌లుపుకుని పోయేందుకు చాలానే ప్ర‌య‌త్నించారు. కానీ గిల్డ్ నిర్మాత‌లు ఎన్నిక‌ల‌పై ఆస‌క్తి చూపించ‌క‌పోవ‌డంతో ఊపు కూడా క‌నిపించ‌లేదు. ప్ర‌స్తుతం సి.క‌ళ్యాణ్ ప్యానెల్ నెగ్గినా గిల్డ్ నిర్మాత‌లు ఏం చెబితే అది అనుస‌రించాల్సిందేనన్న మాటా వినిపిస్తోంది. ఇక కొత్త అధ్య‌క్షుడిగా సి.క‌ళ్యాణ్ ముందు బోలెడ‌న్ని స‌వాళ్లు ఉంటాయ‌న‌డంలో సందేహం లేదు. ఇప్ప‌టికే ఆదాయం లేని మండ‌లిని ఆ క‌ష్టాల నుంచి బ‌య‌ట‌ప‌డేసేందుకు ఏం చేస్తార‌న్న‌ది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. కొన్నిటికి కాల‌మే స‌మాధానం చెబుతుందేమో చూడాలి.