Begin typing your search above and press return to search.

యుఎస్ బాట పట్టిన తెలుగు ఇండస్ట్రీ!

By:  Tupaki Desk   |   14 Aug 2018 1:30 AM GMT
యుఎస్ బాట పట్టిన తెలుగు ఇండస్ట్రీ!
X
ఈ మధ్య అమెరికాను మనవాళ్ళు షూటింగ్ డెస్టినేషన్ గా మార్చుకుంటున్నారు. నిర్మాణ వ్యయం కాస్త ఎక్కువే అవుతున్నా రాజీ పడకుండా నిర్మాతలు రెడీ కావడానికి కారణం సబ్జెక్టు డిమాండ్ చేయటం కూడా కనిపిస్తుంది. అందులోనూ ఈ ఏడాది ఇప్పటి దాకా విడుదలైన నిర్మాణంలో ఉన్న అధిక శాతం సినిమాలు యుఎస్ లో షూటింగ్ జరుపుకున్నవే కావడం గమనార్హం. మహేష్ బాబు 25వ సినిమాగా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న మహర్షిలో కీలక భాగం అమెరికాలోనే ఉండబోతోంది. చాలా ముఖ్యమైన లొకేషన్స్ లో షూటింగ్ ప్లాన్ చేసేలా ఇది ప్రారంభం కావడానికి ముందే దర్శకుడు వంశీ పైడిపల్లి ట్రిప్ వేసి మరీ సెట్ చేసుకున్నాడు. ఇక రవితేజ శీను వైట్ల కాంబోలో మైత్రి సంస్థ నిర్మిస్తున్న అమర్ అక్బర్ ఆంటోనీ కథలో మేజర్ పార్ట్ అక్కడి బ్యాక్ డ్రాప్ లోనే ఉంటుంది. ఇవి కాకుండా మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా అక్కడి వాతావరణంలో తీసేందుకు దర్శక నిర్మాతలు రెడీ అవుతున్నారు.

గత ఐదేళ్లుగా ట్రెండ్ ని గమనిస్తే తెలుగు సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ విస్తృతంగా పెరిగింది. వాళ్ళను మెప్పించే కంటెంట్ ఉంటే చాలు మిలియన్ల డాలర్లు వసూళ్ల రూపంలో వచ్చి పడుతున్నాయి. అందుకే కథలో అక్కడి నేపధ్యాన్ని భాగంగా చేర్చితే ఇంకా బాగా కనెక్ట్ అవుతారు అనే దిశలో రచయితలు ఆలోచించడం దీనికి దారి తీస్తోంది. పైగా అక్కడ షూట్ చేయటం వల్ల రిచ్ నెస్ తో పాటు అనుమతులు అభిమానుల తాకిడి లాంటి చిక్కులు పెద్దగా ఉండవు. సాఫీగా జరిగిపోతుంది. అందుకే యుఎస్ లొకేషన్స్ అందరికి ఫెవరెట్ గా మారుతున్నాయి. ట్రంప్ పెడుతున్న ఆంక్షలు ఇప్పటి పరిస్థితుల మీద ప్రభావం చూపిస్తున్నా ఇప్పటికే అక్కడ సెటిల్ అయిపోయిన ప్రవాసాంధ్రుల జనాభా భారీగా ఉండటంతో తెలుగు సినిమాలు విడుదలైన ప్రతివారం బాగా సందడిగా ఉంటోంది. అందుకే కథ కనక డిమాండ్ చేస్తే నిర్మాతలు ఆలోచించకుండా ఛలో అమెరికా అంటున్నారు.