Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్‌: టాలీవుడ్ ఏపీకి షిఫ్ట‌వుతుందా?

By:  Tupaki Desk   |   21 May 2020 12:03 AM IST
ట్రెండీ టాక్‌: టాలీవుడ్ ఏపీకి షిఫ్ట‌వుతుందా?
X
మ‌హ‌మ్మారీ అన్ని ప‌రిశ్ర‌మ‌ల‌తో పాటు సినీప‌రిశ్ర‌మ‌ల‌కు గొప్ప గుణపాఠం నేర్పించింద‌నేది నిపుణులు చెబుతున్న మాట‌. ప్ర‌జ‌ల‌కు డైరెక్ట్ టు హోమ్ .. డిజిటల్ -ఓటీటీ అవ‌స‌రాన్ని క‌రోనా గుర్తు చేసింది. పాత పంథాలో ఇంకా థియేట‌ర్ల‌కు వెళ్లి జ‌నం సినిమాలు చూసే ప‌ద్ధ‌తి ఇక‌పై మార‌నుంద‌ని తాజా స‌న్నివేశం ప్రూవ్ చేస్తోంది. ఇది ఎగ్జిబిష‌న్ రంగంపై తీవ్ర ప్ర‌భావం చూప‌నుంద‌ని విశ్లేషిస్తున్నారు. ఇంత‌కుముందులా వినోదం కోసం థియేట‌ర్ల వ‌ర‌కూ వెళ్లే సీన్ ఇక‌పై ఉండ‌దు.

ఇదొక్క‌టేనా..? మ‌హ‌మ్మారీ నేర్పిన పాఠాలు ఇంకా ఎన్నో. ప్రస్తుతం అన్ని ప్ర‌ధాన న‌గ‌రాల్ని వైర‌స్ అల్లాడిస్తోంది. అందునా హైద‌రాబాద్ లాంటి చోట ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితి క‌నిపిస్తోంది. తెలంగాణ‌లో కేసుల‌న్నీ ఈ మ‌హాన‌గ‌రంలో న‌మోదైన‌వే. ఇక‌పోతే ఇలాంటి అత్య‌వ‌స‌ర స‌న్నివేశం వ‌చ్చిన‌ప్పుడు టాలీవుడ్ పై ప్ర‌భావం ఎలా ఉంటుందో ఇప్ప‌టికే అనుభ‌వం అయిపోయింది. షూటింగుల్లేవ్.. థియేట‌ర్లు ఓపెన్ కావు. ఇక తెలంగాణ ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి అనుమ‌తులు వ‌చ్చే ప‌రిస్థితి కనిపించ‌లేదు.

ఆ క్ర‌మంలోనే ఆంధ్ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్మోహన్ రెడ్డి ఏపీలో సినిమా-టీవీ షూటింగులు చేసుకోవ‌చ్చ‌ని అందుకు వెసులుబాటు క‌ల్పించార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే.. పెండింగులో ఉన్న షూటింగులు పూర్తి చేసుకునేందుకు నిర్మాత‌లు ఆంధ్రాకు త‌ర‌లి వెళ‌తార‌ని అంచ‌నా వేస్తున్నారు. ఒక‌ట్రెండు రోజుల షూటింగులు.. అలాగే 15-20 రోజుల లోపు పూర్తి చేయాల్సిన వాటి కోసం అటువైపు త‌ర‌లి వెళ‌‌తార‌ని భావిస్తున్నారు. ఇదొక్క‌టే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోనూ రెండు ప‌రిశ్ర‌మ‌లు ఉండాల్సిన అవ‌స‌రాన్ని మ‌హ‌మ్మారీ గుర్తు చేసింది.

ఇన్నాళ్లు ప‌రిశ్ర‌మ డివైడ్ పై చర్చ స‌ద్ధుమ‌ణిగినా .. ఇప్పుడు మ‌రోసారి త‌ర‌లింపుపై చ‌ర్చ మొద‌లైంది. అటు వైయ‌స్ జ‌గ‌న్ సైతం సినీపెద్ద‌ల్ని మ‌రో కొత్త ప‌రిశ్ర‌మ ఏర్పాటుపై ఆలోచించ‌మ‌ని ప్ర‌భుత్వం త‌ర‌పున సాయం కావాలంటే త‌న‌ని సంప్ర‌దించ‌మ‌ని మెగాస్టార్ చిరంజీవి స‌హా పెద్ద‌లకు సూచించారు. ఆ క్ర‌మంలోనే ప్ర‌స్తుత గ‌డ్డు కాలంలో మ‌రోసారి దీనిపై పెద్ద‌లు ఆలోచిస్తున్నార‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. హైద‌రాబాద్ ప‌రిశ్ర‌మ ఎటూ పోదు.. కానీ వైజాగ్ లాంటి చోట మ‌రో కొత్త ప‌రిశ్ర‌మ పాదుకుంటే అది అన్నిర‌కాలా మంచిద‌ని ప‌లువురు ఔత్సాహిక నిర్మాతలు భావిస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే విశాఖ ప‌రిస‌రాల్లో ప‌లు స్టూడియోల నిర్మాణానికి సినీపెద్ద‌లు న‌డుంక‌ట్టార‌న్న ప్ర‌చారం ఉంది. కేవ‌లం క‌రోనా క‌ష్టం వ‌ల్ల ప‌రిశ్ర‌మ వెళ్ల‌డం కాదు కానీ.. ఈ క‌ష్ట‌కాలంలోనే మ‌రిన్ని అంశాల్ని డీప్ గా ఆలోచించాల్సిన ప‌రిస్థితి ఉంద‌ని విశ్లేషిస్తున్నారు. ఎలానూ సినీపెద్ద‌లు.. స్టార్ల‌కు కావాల్సినంత స‌మ‌యం ఉంది కాబ‌ట్టి దీనిపై ఆలోచిస్తున్నార‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. నేడో రేపో ప‌రిశ్ర‌మ ప్ర‌ముఖులంద‌రితో కీల‌క భేటీలో ప‌లు అంశాల్ని చ‌ర్చించ‌నున్న మెగాస్టార్ వైజాగ్ ప‌రిశ్ర‌మ‌పైనా క‌ద‌లేస్తార‌నే భావిస్తున్నారు.