Begin typing your search above and press return to search.

ఇదేం రిలీజ్ ప్లానింగ్ బాబులూ..

By:  Tupaki Desk   |   26 Oct 2017 11:30 PM GMT
ఇదేం రిలీజ్ ప్లానింగ్ బాబులూ..
X
అయితే అతివృష్టి.. లేకుండా అనావృష్టి అన్నట్లుగా ఉంది టాలీవుడ్లో కొత్త సినిమాల రిలీజ్. గత నెలలో దసరా సీజన్లో వారం వ్యవధిలో మూడు సినిమాలొచ్చాయి. కానీ ఈ నెలలో మూడు వారాలు గడిచేసరికి రిలీజైంది రెండే సినిమాలు. తొలి వారంలో కొత్త సినిమాల రిలీజే లేదు. దసరా సినిమాలకే రాసిచ్చేశారు. ఆ తర్వాతి రెండు వారాల్లో ‘రాజు గారి గది-2’.. ‘రాజా ది గ్రేట్’ వచ్చాయి. దీపావళి సీజన్లో ఒకటే సినిమా రిలీజైంది. ఈ నెల చివరి వారాంతంలో ‘ఉన్నది ఒకటే జిందగీ’ రాబోతోంది. ‘అదిరింది’ కూడా వస్తే రావచ్చు. దాన్ని కూడా కలుపుకుంటే ఈ నెల మొత్తంలో రిలీజైంది నాలుగే సినిమాలు. అందులో మూడు మాత్రమే డైరెక్ట్ తెలుగు సినిమాలు.

కానీ వచ్చే నెల మొదటి వారంలో ఒకే రోజు ఏకంగా నాలుగు సినిమాలు రిలీజ్ చేసేస్తున్నారు. రాజశేఖర్ సినిమా ‘గరుడవేగ’తో పాటు అల్లు అరవింద్ ప్రొడక్షన్లో తెరకెక్కిన ‘నెక్స్ట్ నువ్వే’.. సోషియో ఫాంటసీ మూవీ ‘ఏంజెల్’.. సిద్దార్థ్ త్రిభాషా చిత్రం ‘గృహం’.. ఈ నాలుగు సినిమాలనూ నవంబరు 3కే షెడ్యూల్ చేశారు. వీటిలో ఏదీ వెనక్కి తగ్గేలా లేదు. ఎవరికి వారు ఆ డేటుకే ఫిక్సయ్యారు. ఇది అన్ని సినిమాలకూ ఇబ్బందికరమైన విషయమే. ఈ నెలలో ఒక వారాన్ని ఖాళీగా వదిలేసి.. మిగతా వారాల్ని ఒక్కొక్క సినిమాకే రాసిచ్చేసి.. వచ్చే నెలలో ఏమో ఒకే రోజు నాలుగు సినిమాల్ని బరిలోకి దించుతున్నారు. మరి ఆయా చిత్రాల నిర్మాతల ప్లానింగ్ గురించి ఏం మాట్లాడాలి? ఈ రోజుల్లో సరైన టైమింగ్ లో సినిమాను రిలీజ్ చేయడం చాలా కీలకం. ఇలాంటి ప్లానింగ్ ఉంటే సినిమాల ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పేదేముంది?