Begin typing your search above and press return to search.

రోబో2 సందడి..రాజమౌళి..మాక్కావల్సిందే..

By:  Tupaki Desk   |   2 Nov 2018 6:09 AM GMT
రోబో2 సందడి..రాజమౌళి..మాక్కావల్సిందే..
X
ఒకప్పుడు దేశవ్యాప్తంగా రెండే సినిమాలకు క్రేజ్.. ఒకటి బాలీవుడ్.. రెండు కోలీవుడ్.. ఒకానొక దశలో హిందీ సినిమాలను తలదన్నేలా తమిళనాట సినిమాలొచ్చాయి.. తెలుగు సినిమాలకు , దర్శకులకు అంత దమ్ములేదని తమిళ ఇండస్ట్రీలో ఆడిపోసుకునేవారు. కానీ కాలం మారింది. మనకూ ఓ ‘బాహుబలి’ వచ్చాడు. జక్కన్న చెక్కిన శిల్పాలు ప్రపంచాన్నే షేక్ చేశాయి.. ఆఫ్ట్రాల్ అరవవాళ్లెంత.? దిగ్గజ దర్శకుడు శంకర్ తీసిన ‘ఐ’ ఫ్లాప్ కావడం.. రాజమౌళి ‘బాహుబలి’ బ్లాక్ బస్టర్ కావడంతో తెలుగుపై దేశం దృష్టి పడింది. మనోళ్ల కథలకు డిమాండ్ పెరిగింది. ఇలా కిక్ - ప్రస్థానం - అర్జున్ రెడ్డి సహా చాలా తెలుగు కథలు బాలీవుడ్ కు వెళ్లాయి. అక్కడ తెలుగు సత్తాను ఇనుమడింపచేశాయి..

కానీ మళ్లీ ఇప్పుడు పోటీ వచ్చింది. బాహుబలి టైంలో తెలుగు వర్సెస్ తమిళ సినిమా యుద్ధం జరిగింది. రాజమౌళి వర్సెస్ శంకర్ స్టామినాను అందరూ కొలిచారు. కానీ అప్పుడు టైం మనది.. రాజమౌళి నిలిచి గెలిచాడు.. అదీ అలా ఇలా కాదు.. దేశం గర్వించేలా.? ‘ఐ’తో శంకర్ వెనుకబడిపోయాడు. దిగ్గజ దర్శకుడు శంకర్ కీర్తి కిరీటంలో ఎన్నో మైలురాళ్లున్నాయి. రాజమౌళితో పోల్చితే ఆయనే సీనియర్. ప్రతిభావంతుడు. తమిళ సినిమాకు విశ్వవ్యాప్త గుర్తింపు తెచ్చాడు. కానీ ఇప్పుడు టైం తెలుగు వారిదే..

మన అర్జున్ రెడ్డిని కూడా తమిళోళ్లు డబ్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండతో ‘నోటా’ తీశారు. ప్రభాస్ బాహుబలితో సత్తా చాటాడు. మహేశ్ బాబు శ్రీమంతుడై పలకరించాడు. ఒకప్పుడు రజినీకాంత్ - కమల్ - సూర్య లాంటి హీరోలు తెలుగు మార్కెట్ వైపు చూస్తే.. ఇప్పుడు మన హీరోలు తమిళ మార్కెట్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నారు..

‘కాలం చాలా చిన్నది చిట్టి’ అని రోబో1లో ఓ డైలాగ్ ఉంది. ఇప్పుడు కాలం తెలుగు సినిమాదే.. కానీ మళ్లీ వచ్చాడు శంకర్.. రోబో2తో పెను ప్రకంపనలు సృష్టించేందుకు రెడీ అయ్యారు. ఐ ఫ్లాప్ అయ్యాక కసితో తీశాడు. రోబో2 హిట్ కావాలని మనసారా కోరుకుందాం. ఈ నవంబర్ చివరి వారంలో వచ్చే సినిమాను చూసి ఎంజాయ్ చేద్దాం.. కానీ ఒక్కటే లోటు.. బాహుబలి వచ్చి ఇన్నిరోజులైనా మన జక్కన్న ఇంకా చెక్కుతూనే ఉన్నాడు. ఆ రోబో రిలీజ్ వరకైనా కనీసం సినిమా ఇదీ.. ఓ ఫస్ట్ లుక్ కానీ.. చిన్న పోస్టర్ కానీ.. సినిమా టైటిల్ కానీ అనౌన్స్ చేస్తే బాగుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. రోబో2ను స్వాగతిస్తూనే మా జక్కన్న నెక్ట్స్ సినిమా ఇదీ అని ఘనంగా చెప్పుకునే అవకాశం ఇవ్వాలని తెలుగు అభిమానులు కోరుతున్నారు..

మరి మన జక్కన్న రోబో2కు పోటీగానైనా తన తరువాతి ప్రాజెక్ట్ ‘ఆర్ ఆర్ ఆర్’ గురించి ఏదైనా ఒక విషయం చెబితే తెలుగు అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. తమిళ రోబో2కు పోటీగా మనోడు నిలుస్తున్నాడని సంబరపడుతారు.. మరి రాజమౌళి సారూ.. మీరు రెడీనా.?