Begin typing your search above and press return to search.

శోకతప్త హృదయాలతో... ప్రముఖుల వీడుకోలు

By:  Tupaki Desk   |   8 Sep 2020 9:30 AM GMT
శోకతప్త హృదయాలతో... ప్రముఖుల వీడుకోలు
X
జయ ప్రకాష్ రెడ్డి మరణంతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా మూగపోయింది. ఇండస్ట్రీలో ఆప్తుడిగా మెలిగిన ఆ యన మరణం అందరినీ కలచి వేస్తోంది. ప్రతి ఒక్కరూ ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ట్వీట్లు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు.

రత్నాన్ని కోల్పోయాం : జగన్
జయప్రకాశ్ రెడ్డి అకాల మరణంతో ఇవాళ తెలుగు సినిమా, థియేటర్ నేడు ఒక రత్నాన్ని కోల్పోయాయి. కొన్ని దశాబ్దాలుగా సాగిన ఆయన సినీజీవితంలో అద్భుతమైన నటనతో, బహుముఖ ప్రదర్శనలతో ఎన్నో మధురమైన, మరపురాని జ్ఞాపకాలను మూటగట్టుకున్నారు. ఆయన అకాల మృతిపట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ కుటుంబసభ్యులకు సానుభూతిని ప్రకటిస్తున్నా'' అని ఏపీ సీఎం జగన్ ఓ ప్రకటన లో పేర్కొన్నారు.

అత్యంత బాధాకరం: సీఎం కేసీఆర్​
రంగస్థల, నాటక, సినీనటుడిగా సుప్రసిద్ధుడైన జయప్రకాష్​రెడ్డి మృతి ఎంతో బాధాకరం. తెలుగు సినీపరిశ్రమ గొప్ప నటుడిని కోల్పోయింది. ఆయన కుటుంబసభ్యులకు, అభిమానులకు సంతాపం తెలుపుతున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా.


గొప్ప నటుడిని కోల్పోయాం : చిరంజీవి
తాను చివరిసారిగా తన 150వ చిత్రం ఖైదీ నంబర్ 150లో జయప్రకాశ్ రెడ్డితో నటించానని.. ఆయన శని, ఆది వారాల్లో షూటింగులు పెట్టుకునేవారు కాదని.. వారంలో ఆ రెండు రోజులు ఆయన స్టేజ్ పర్ఫార్మెన్సులు ఇచ్చేవారని.. సినీ ఇండస్ట్రీ గొప్ప నటుడిని కోల్పోయిందని చిరంజీవి ట్వీట్ చేశారు.

మరణ వార్త విని చాలా బాధ పడ్డా : మహేశ్​బాబు

జయప్రకాష్ రెడ్డి మరణ వార్త విని బాధపడ్డాను. తెలుగు ఇండస్ట్రీ గొప్ప నటుడిని కోల్పోయింది. ఆయనతో కలిసి చేసిన ప్రతీ క్షణం, ప్రతీ మూమెంట్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆయన కుటుంబానికి, ఆయన అభిమానులకు వారందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని మహేష్ బాబు ట్వీట్ చేశాడు.

ఆయన మృతి విచారకరం: నందమూరి బాలకృష్ణ

ఎన్నో మంచి పాత్రలతో మెప్పించిన విలక్షణ నటుడు జయప్రకాష్ రెడ్డి గారి మృతి విచారకరం, పరిశ్రమకు తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను'' అంటూ నందమూరి బాలకృష్ణ సంతాపం తెలిపారు. తెలుగు సినిమా ఒక రత్నాన్ని కోల్పోయింది. ఆయన నటించిన సినిమాలు ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చాయని ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.

తీవ్రంగా కలిచివేసింది : ప్రకాశ్​రాజ్​
జయప్రకాష్ రెడ్డి మృతి తీవ్రంగా కలచివేసింది. నటనంటే ఆయనకు ప్రాణం. ఆయనలా మాండలికాన్ని పలికే వారు ఇప్పటి నటుల్లో చాలా అరుదుగా ఉన్నారు. మమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్స్.. ఆత్మకు శాంతి కలగాలి అని ప్రకాష్ రాజ్ ఎమోషనల్ అయ్యాడు.

ఎన్టీఆర్, అనిల్ రావిపూడి, రామ్, జెనీలియా జేపీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు కొరిటెపాడులో మంగళవారం నిర్వహిస్తారు.