Begin typing your search above and press return to search.

సీరియల్ ఆర్టిస్టుల పట్ల ఒక చిన్నచూపు ఉంటుంది: బుల్లితెర నటుడు నిరుపమ్

By:  Tupaki Desk   |   19 May 2021 12:30 AM GMT
సీరియల్ ఆర్టిస్టుల పట్ల ఒక చిన్నచూపు ఉంటుంది: బుల్లితెర నటుడు నిరుపమ్
X
నటుడు నిరుపమ్ అనడం కంటే .. 'కార్తీక దీపం' సీరియల్లో డాక్టర్ బాబు అంటే వెంటనే ఎవరైనా గుర్తుపట్టేస్తారు. అంతగా ఆ సీరియల్ ఇప్పుడు జనంలోకి వెళ్లింది. నిరుపమ్ చాలా సీరియల్స్ లో నటించాడు. కాకపోతే ఇప్పుడు ఈ సీరియల్ పాప్యులర్ అయింది. అనేక సినిమాలకు .. సీరియల్స్ కు కథలను .. మాటలను అందించిన ఓంకార్ తనయుడే నిరుపమ్. తాజాగా ఆయన 'ఆలీతో సరదాగా' కార్యక్రమం ద్వారా, తన మనోభావాలను పంచుకున్నాడు. తన కెరియర్ కు సంబంధించిన అనేక విషయాలను గురించి మాట్లాడాడు.

"నాకు సినిమా అంటే చాలా ఇష్టం .. తెరపై కనిపించడానికి నా ప్రయత్నాలు నేను చేశాను. సాధారణంగా సీరియల్స్ ఆర్టిస్టుల పట్ల ఒక చిన్నచూపు ఉంటుంది .. ఆ విషయం నాకు ముందుగానే తెలుసు. ఆడిషన్స్ కి వెళ్లి సరిగ్గా చేయలేకపోతే వెంటనే రిజెక్ట్ చేయవచ్చు. అది చేయకుండా సీరియల్స్ చేస్తున్నామనే ఒకే ఒక కారణంగా పంపించేస్తే ఎవరైనా హర్ట్ అవుతారు. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు నాకు అలాంటి అనుభవమే ఎదురైంది. సీరియల్స్ ఆర్టిస్టులను చులకనగా చూస్తారనడానికి నాకు ఎదురైన సందర్భం ఇది.

మొదటి నుంచి కూడా నాది అంతగా దూసుకుపోయే మనస్తత్వం కాదు. అందువలన తెలిసినవాళ్లు ఉంటే తప్ప సినిమాల్లో ట్రై చేయను. 'అష్టా చమ్మా' సినిమా షూటింగుకు ముందు జరిగిన ఆడిషన్స్ కి కూడా వెళ్లాను. నాకు ఒక సీన్ పేపర్ ఇచ్చి .. మరుసటి రోజు రమ్మని చెప్పారు. ఆ రోజు సాయంత్రం నేను చేసిన ఓ సీరియల్ చూశారట. మరుసటి రోజు ఆడిషన్స్ కి వెళ్లాను. 'సీరియల్ చేస్తున్నట్టున్నావ్ గదా ... చూశాను .. చెప్తాన్లే' అన్నారు. 'మరి ఆడిషన్ సార్' అన్నాను. 'ఇంకెందుకూ .. ఏం వద్దులే' అన్నారు. అప్పుడు చాలా బాధగా అనిపించింది" అని చెప్పుకొచ్చాడు.