Begin typing your search above and press return to search.

ఫన్నీగా ఉన్న కీరవాణి తనయుడి 'తెల్లవారితే గురువారం' టీజర్..!

By:  Tupaki Desk   |   26 Feb 2021 4:39 PM IST
ఫన్నీగా ఉన్న కీరవాణి తనయుడి తెల్లవారితే గురువారం టీజర్..!
X
సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు, 'మత్తు వదలరా' ఫేమ్ శ్రీ సింహా కోడూరి నటిస్తున్న తాజా చిత్రం ''తెల్లవారితే గురువారం''. మణికాంత్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ లో చిత్రా శుక్లా - మిషా నారంగ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాయి కొర్రపాటి సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం - లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లపై రజని కొర్రపాటి - రవీంద్ర బెనర్జీ ముప్పనేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఈ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఈ చిత్రాన్ని మార్చి 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా 'తెల్లవారితే గురువారం' టీజర్ ను మెగా హీరో వరుణ్ తేజ్ విడుదల చేశారు.

మరి కొన్ని గంటల్లో పెళ్లి చేసుకోవాల్సిన హీరో నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పడం.. 'పెళ్లి తర్వాత జరగాల్సినవి పెళ్లికి ముందే జరిగిపోతే నీకు ఈ పెళ్లి ఎందుకు ఇష్టముంటది' అని సత్య వారించడంతోనే ఈ సినిమా నేపథ్యం ఏంటో అర్థం అవుతోంది. పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి హీరో తన లవ్ స్టోరీ గురించి చెప్తుండటం ఈ టీజర్ లో చూపించారు. 'నువ్వు నా నుంచి చాలా ఎక్సపెక్ట్ చేస్తున్నావ్.. మగధీర కాదిక్కడ మర్యాదరామన్న' అంటూ సింహా చెప్పే డైలాగ్ బాగుంది. దీనికి కీరవాణి మరో తనయుడు కాల‌భైర‌వ అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి సురేష్ రగుతు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించగా.. సత్య ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. టీజర్ తో అలరించిన 'తెల్లవారితే గురువారం' థియేటర్స్ లో ఏ స్థాయిలో నవ్వులు పూయిస్తుందో చూడాలి.