Begin typing your search above and press return to search.

ఎన్.శంక‌ర్ స్టూడియో పై హైకోర్టు విచార‌ణ‌!

By:  Tupaki Desk   |   5 May 2020 9:15 AM IST
ఎన్.శంక‌ర్ స్టూడియో పై హైకోర్టు విచార‌ణ‌!
X
టాలీవుడ్ సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు ఎన్.శంక‌ర్ కి కోర్టు చిక్కులు త‌ప్ప‌డం లేదు. హైద‌రాబాద్ ఔట‌ర్ లో ఫిలింస్టూడియో నిర్మాణం కోసం ఆయ‌న‌కు తెరాస ప్ర‌భుత్వం కేటాయించిన ఐదెక‌రాల భూమిపై హైకోర్టు లో విచార‌ణ సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఎక‌రం 5కోట్లు విలువ ఉన్న చోట 5ల‌క్ష‌ల‌కే ఎలా ఎన్.శంక‌ర్ కి కేటాయిస్తారు? అంటూ క‌రీంన‌గ‌ర్ ధ‌ర్మ‌పురికి చెందిన జె.శంక‌ర్ అనే ఆసామి హైకోర్టు లో ప్ర‌జాప్ర‌యోజ‌న‌ వ్యాజ్యాన్ని దాఖ‌లు చేశారు. తాజాగా దీనిపై మ‌రోసారి కోర్టు విచారించింది.

ఔట‌ర్ ప‌రిస‌రాల్లో అంత ఖ‌రీదైన భూమిని ఫిలింస్టూడియోకి కేటాయించ‌డంపై స‌వాల్ విసిరినందున ఈ త‌ర‌హా కేసుల‌న్నిటినీ కోర్టు ఒకేసారి విచారించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్- న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డి ఈ విచార‌ణ‌ను రెండు వారాల పాటు వాయిదా వేస్తున్నామ‌ని చెప్పారు. ఇక హైద‌రాబాద్ ఔట్ స్క‌ర్ట్స్ ఓ ఈ త‌ర‌హాలో ప‌లు కేసులు ఉన్నాయ‌ని వాట‌న్నిటినీ ఏక‌మొత్తంగా విచారిస్తామ‌ని కోర్టు వెల్ల‌డించింది. ఈ కేసుల్లో జీహెచ్.ఎం.సీ ముఖ్య కార్య‌ద‌ర్శిని ప్ర‌తివాదిగా చేరుస్తున్నామ‌ని తెలిపింది.

ఇక తెరాస ప్ర‌భుత్వంతో ఎన్.శంక‌ర్ సాన్నిహిత్యంపై ప‌రిశ్ర‌మ‌లో చ‌ర్చ తెలిసిన‌దే. ప్ర‌త్యేక తెలంగాణ ఉద్య‌మానికి స‌పోర్టుగా నిలుస్తూ `జై భోలో తెలంగాణ` చిత్రాన్ని ఎన్.శంక‌ర్ తెర‌కెక్కించారు. ఆ సినిమా సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఉద్య‌మానికి బాస‌ట‌గా నిలిచినందుకు ఆయ‌న‌కు ఫిలింస్టూడియో నిర్మాణం కోసం ఐదెక‌రాల్ని కేటాయిస్తూ తెరాస ప్ర‌భుత్వం జీవోను జారీ చేసింది. ఇక ఖ‌రీదైన నివాస యోగ్య‌మైన స్థ‌లాన్ని ఆయ‌న‌కు క‌ట్ట‌బెట్ట‌డంపై ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యం దాఖ‌లైంది.