Begin typing your search above and press return to search.

టికెట్ల బుకింగ్ కోసం తెలంగాణ ప్రభుత్వ వెబ్ సైట్

By:  Tupaki Desk   |   8 Oct 2017 10:51 AM GMT
టికెట్ల బుకింగ్ కోసం తెలంగాణ ప్రభుత్వ వెబ్ సైట్
X
తమిళనాట విశాల్ ఆధ్వర్యంలోని తమిళ నిర్మాతల మండలి ఈ మధ్యే తమ తరఫున ఓ ఆన్ లైన్ టికెట్ బుకింగ్ యాప్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రైవేటు ఆన్ లైన్ బుకింగ్ వెబ్ సైట్లతో పోలిస్తే ఇందులో కన్వేయెన్స్ ఛార్జీలు తక్కువ. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సైతం ఇదే తరహాలో ఓ కొత్త వెబ్ సైట్ తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట్ర చలన చిత్రాభివృద్ధి సంస్థ (టీఎస్‌ ఎఫ్‌ డీసీ) ఆధ్వర్యంలో ఆన్‌ లైన్‌ టికెటింగ్‌ పోర్టల్‌ ప్రారంభించింది. ‘టీఎస్‌ బాక్స్‌ ఆఫీస్‌.ఇన్‌’ ద్వారా ఆన్‌ లైన్‌ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఈ పోర్టల్ ను ఆరంభించారు.

తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి దిశగా మరిన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు మంత్రి తలసాని తెలిపారు. షూటింగుల కోసం సింగిల్‌ విండో అనుమతులు అందించే ఆన్‌లైన్‌ విధానాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం మంత్రులతో సబ్‌ కమిటీ వేసిందని.. వారికి ఉపయోగపడే ఎన్నో నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన చెప్పారు. సినిమా షూటింగ్‌ల కోసం వివిధ శాఖల నుంచి అనుమతుల కోసం నిర్మాతలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని టీఎస్‌ ఎఫ్‌ డీసీకి ఆన్‌ లైన్‌ లో దరఖాస్తు చేసుకుంటే ఏడు రోజుల్లోపు అన్ని అనుమతులు మంజూరవుతాయన్నారు. ఏడు రోజుల్లో అనుమతి రాకపోతే అనుమతి వచ్చినట్లుగానే పరిగణించి షూటింగ్‌ ప్రారంభించుకోవచ్చన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఫిలిం స్టూడియో నిర్మాణానికి సంబంధించి స్థలం ఎంపిక కోసం దీపావళి తరువాత పర్యటిస్తామన్నారు. ఆర్టీసీ బస్టాండ్లలో మినీ థియేటర్ల నిర్మాణానికి టెండర్లు పిలిచినట్లు వెల్లడించారు. చిన్న సినిమాలను ప్రోత్సహించడం కోసం ఐదో ఆట ప్రదర్శనకు అనుమతులు ఇస్తామన్నారు.