Begin typing your search above and press return to search.

మూడు నెల‌ల‌కు మొద‌లైన షూటింగుల‌ సంద‌డి..!

By:  Tupaki Desk   |   12 Jun 2020 10:30 AM IST
మూడు నెల‌ల‌కు మొద‌లైన షూటింగుల‌ సంద‌డి..!
X
ఏపీ-తెలంగాణ ప్ర‌భుత్వాలు షూటింగుల‌కు అనుమ‌తులివ్వ‌డంలో సానుకూలంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో హ‌ర్షం వ్య‌క్త‌మైంది. మ‌రో వారం రెండు వారాల్లో సినిమాల షూటింగుల‌కు స‌న్నాహ‌కాల్లో ఉన్నారు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. ఈలోగా టీవీ సీరియ‌ళ్ల షూటింగులు ప్రారంభ‌మ‌య్యాయి. సెట్స్ కెళ్లేందుకు న‌టీన‌టులు స‌హా కార్మికులు సిద్ధ‌మ‌వ్వ‌డంతో టాలీవుడ్ లో దాదాపు మూడు నెల‌ల విరామం త‌ర్వాత కొత్త క‌ళ క‌నిపించింది. దాదాపు అర‌డ‌జ‌ను సీరియ‌ళ్ల షూటింగుల‌కు ఇప్ప‌టికే స‌న్నాహ‌కాల్లో ఉన్నాయి యూనిట్లు.

టీవీ సీరియ‌ళ్ల‌కు ప‌రిమిత సిబ్బందితో ఫ‌ర్వాలేదు కానీ సినిమాల విష‌యంలోనే కాస్త ఆలోచించుకోవాల్సిన ప‌రిస్థితి ఉంటుంద‌ని అంచ‌నా. ఇప్ప‌టివ‌ర‌కూ ఒక్క‌రూ షూటింగ్ ప్రారంభించ‌లేదు. అంద‌రికంటే ముందుగా జ‌క్క‌న్న ఆర్.ఆర్.ఆర్ షూట్ ప్రారంభించాల‌ని అనుకుంటున్నారు. మ‌రో వారంలోనే ఆయ‌న సెట్స్ కెళ్ల‌నున్నారు. స‌క్సెసైతే అత‌డిని ఫాలో చేసేందుకు ఇత‌రులు వేచి చూస్తున్నారు.

సెట్స్ లో ప్ర‌భుత్వ నియమ నిబంధ‌న‌ల్ని పాటిస్తూ షూటింగులు చేయాలి కాబ‌ట్టి రాజ‌మౌళి కూడా ట్ర‌య‌ల్ షూట్ కి ప్రిపేర‌వుతున్నార‌నే భావించాల్సి ఉంటుంది. ఆయ‌న స‌క్సెసైతే ఇత‌రులు అదే ఫార్ములాని అనుస‌రించే వీలుంటుంది. ఇప్ప‌టికి పెండింగ్ షూటింగులు ఉన్న వాళ్లు మాత్ర‌మే సెట్స్ కెళ‌తారు. సినిమాలు ప్రారంభించిన వాళ్లు కాస్త ఆల‌స్యంగా సెట్స్ కెళ‌తారు. హీరోల వైపు నుంచి అభ్యంత‌రాలు ఉన్నాయి కాబ‌ట్టి ఆచితూచి షూటింగుకు వెళ్లే వాళ్లు ఉన్నారు. సీరియ‌ల్ యాక్టివిటీతో మొద‌లెట్టారు. సినిమాలు స్వింగులోకి తేవ‌డానికి స‌మ‌యం ప‌డుతుంది. రాజ‌మౌళి అంద‌రికీ దారి చూపిస్తారేమో చూడాలి.