Begin typing your search above and press return to search.

సినీ ఇండస్ట్రీ ఆర్జీవీ వేసిన బాటలోనే నడవబోతోందా...?

By:  Tupaki Desk   |   16 July 2020 2:40 PM IST
సినీ ఇండస్ట్రీ ఆర్జీవీ వేసిన బాటలోనే నడవబోతోందా...?
X
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి వల్ల ఏర్పడిన పరిస్థితుల కారణంగా సినిమా థియేటర్లు మల్టీప్లెక్సెస్ మూతబడ్డాయి. దీంతో సినిమా రిలీజులు ఆగిపోవడంతో పాటు చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది. ప్రస్తుతం కరోనా తీవ్ర రూపం దాల్చుతుండటంతో థియేటర్స్ ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో సినీ అభిమానులు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ ని ఆశ్రయిస్తున్నారు. విరివిరిగా అందుబాటులో ఉన్న అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్, జీ 5, ఆహా, సన్ నెక్స్ట్, ఎమెక్స్ ప్లేయర్ వంటి ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ లో విడుదలవుతోన్న సినిమాలను వీక్షిస్తున్నారు. అయితే ఇదే సమయంలో సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరో కొత్త ఫ్లాట్ ఫార్మ్ కి శ్రీకారం చుట్టి సంచలనం రేపాడు. సినిమాలు రిలీజ్ చేయడానికి థియేటర్స్ అవసరం లేదంటూ 'ఏటీటీ' అనే కొత్త పద్ధతిని తీసుకొచ్చారు. 'ఏటీటీ' అంటే 'ఎనీ టైం థియేటర్' అని అర్థం.

ఓటీటీకి ఏటీటీకి డిఫరెన్స్ ఉంది. ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ ని నెల లేదంటే ఏడాదికి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అందులో వచ్చే కంటెంట్ మొత్తాన్ని వీక్షించొచ్చు. అయితే ఏటీటీలో మాత్రం ప్రతి సినిమాకు 'పే ఫర్ వ్యూ' పద్ధతిలో టికెట్ ధర చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో రామ్ గోపాల్ వర్మ 'క్లైమాక్స్' 'నగ్నం' సినిమాను ఏటీటీలో రిలీజ్ చేసి లాభాలు గడించాడు. దీని కోసం ప్రముఖ ఈవెంట్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ శ్రేయాస్ ఈటీ సంస్థ కూడా వర్మతో కలిశారు. ఈ క్రమంలో మరో నిర్మాత రామసత్యనారాయణ కూడా ఈ ఏటీటీ రంగంలోకి అడుగుపెడుతున్నారు. 'భీమవరం టాకీస్' పేరిట ఏటీటీ ప్లాట్‌ ఫార్మ్ క్రియేట్ చేసి కరోనా కారణంగా థియేటర్లలో విడుదలకు నోచుకోని సినిమాలను విడుదల చేయబోతున్నారు. పే ఫర్ వ్యూ విధానంలో టికెట్ ధర 59 రూపాయలుగా నిర్ణయించే ఆలోచనలో ఉన్నారట.

ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ శిష్యుడు డైరెక్టర్ తేజ కూడా ఇదే ఆలోచన చేస్తున్నాడట. వర్మ వేసిన బాటలోనే ఓ పర్సనల్ ఆన్లైన్ థియేటర్ క్రియేట్ చేసి సినిమాలు రిలీజ్ చేసే ప్లాన్స్ చేస్తున్నారట. ఓటీటీలు చిన్న సినిమాలు విడుదల చేసుకొడానికి మాత్రమే పనికొస్తాయని.. అదే ఏటీటీలో అయితే 'పే ఫర్ వ్యూ' పద్ధతిలో పెద్ద సినిమాలు కూడా రిలీజ్ చేసి లాభాలు పొందవచ్చని క్రియేటివ్ డైరెక్టర్ తేజ అనుకుంటున్నారట. ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ ఆ దిశగా అడుగులు వేసి సక్సెస్ అవడంతో ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది ఏటీటీ లు స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నారట. ఇక 'ఆర్.ఆర్.ఆర్' లాంటి సినిమాలు 500 రూపాయలు టికెట్ పెట్టి ఆన్లైన్ రిలీజ్ చేసినా చూస్తారని ప్రొడ్యూసర్ సురేష్ బాబు వ్యాఖ్యానించారు. వర్మ కూడా రాజమౌళికి అదే సలహా ఇచ్చారు. మరి రాబోయే రోజుల్లో సినీ ఇండస్ట్రీ ఆర్జీవీ వేసిన బాటలోనే నడుస్తుందేమో చూడాలి.