Begin typing your search above and press return to search.

టక్ జగదీష్ స్థానంలోకి కొత్త సినిమా

By:  Tupaki Desk   |   14 April 2021 3:30 AM GMT
టక్ జగదీష్ స్థానంలోకి కొత్త సినిమా
X
‘వకీల్ సాబ్’ సందడి అయ్యాక తర్వాతి రెండు వారాల్లోనూ రెండు ఆసక్తికర సినిమాలుండటంతో వాటి కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు ప్రేక్షకులు. కానీ ఆ రెండూ వాయిదా పడిపోయాయి. కరోనా సెకండ్ వేవ్‌ కారణంగా నాగచైతన్య-సాయిపల్లవిల ‘లవ్ స్టోరి’ని ఏప్రిల్ 16 నుంచి వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనాకు తోడు ఏపీలో టికెట్ల రేట్ల గొడవ కారణంగా తర్వాతి వారానికి షెడ్యూల్ అయిన నాని సినిమా ‘టక్ జగదీష్’ను సైతం దాని నిర్మాతలు వాయిదా వేసేశారు. దీంతో రెండు వారాలు కొత్త సినిమాలు లేక ఖాళీ ఏర్పడింది. ఈ వారానికి ‘వకీల్ సాబ్’ సందడి కొనసాగేలా ఉన్నా.. వచ్చే వారానికి మాత్రం థియేటర్లు వెలవెలబోవడం ఖాయం. ఐతే అనుకోకుండా దొరికిన ఈ అవకాశాన్ని ఓ చిన్న సినిమా ఉపయోగించుకోబోతంది. ‘టక్ జగదీష్’ రావాల్సిన ఏప్రిల్ 23కు ఆ సినిమా షెడ్యూల్ అయింది.

ఇలా కొత్తగా రేసులోకి వచ్చిన ఆ చిన్న సినిమా.. ఇష్క్. బాలనటుడిగా ఎంతో అనుభవం సంపాదించి, ‘జాంబి రెడ్డి’తో హీరోగా అరంగేట్రం చేసిన తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఇది. అతడికి జోడీగా మలయాళ భామ ప్రియ ప్రకాష్ వారియర్ నటించింది. ఎస్.ఎస్.రాజు అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. తెలుగులో ఒకప్పుడు భారీ చిత్రాలు నిర్మించి, ఎన్నో విజయాలందుకున్న తమిళ నిర్మాత ఆర్.బి.చౌదరి ‘సూపర్ గుడ్ ఫిలిమ్స్’ బేనర్లో ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశాడు. కొన్ని నెలల ముందు ఈ సినిమా గురించి అనౌన్స్‌మెంట్ వచ్చింది. తర్వాత చప్పుడే లేదు.

ఇప్పుడేమో ఉన్నట్లుండి విడుదల అంటున్నారు. ఈ చిన్న సినిమాకు మంచి టైమింగ్ కుదిరింది కానీ.. ముందు బాగా ప్రమోట్ చేసి ఈ చిత్రాన్ని జనాల్లోకి తీసుకెళ్లాల్సి ఉంది. ‘జాంబి రెడ్డి’తో ఓ మోస్తరు విజయాన్నందుకున్న తేజ.. ఈ చిత్రంతో ఎలాంటి ఫలితాన్నందుకుంటాడో చూడాలి.