Begin typing your search above and press return to search.

ఫస్ట్ లుక్స్.. టీజర్స్ పేలిపోతున్నాయ్!

By:  Tupaki Desk   |   15 Feb 2017 5:30 PM GMT
ఫస్ట్ లుక్స్.. టీజర్స్ పేలిపోతున్నాయ్!
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ‘కాటమరాయుడు’ విషయంలో మొదట్నుంచి నెగెటివ్ వార్తలే వినిపిస్తూ వచ్చాయి. పవన్ గత సినిమాల స్థాయిలో దీనికి హైప్ రాలేదు. ఇది ఆడే సినిమా కాదన్న ఫీలింగ్ పవర్ స్టార్ అభిమానుల్లో వచ్చేసింది. సామాన్య ప్రేక్షకులకు ఈ సినిమాపై అంతగా ఆసక్తి కలగలేదు. పవన్ ఫ్యాన్స్ సైతం ఈ చిత్రాన్ని లైట్ తీసుకున్నట్లే కనిపించారు. కానీ ఇదంతా వారం కిందటి వరకే. ఈ సినిమా టీజర్ బయటికి వచ్చాక మొత్తం కథ మారిపోయింది. అర నిమిషం టీజర్ తో అందరి దృష్టినీ ఈ సినిమా వైపు తిప్పాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఈ చిత్రంపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. బిజినెస్ ఆఫర్లు కూడా భారీ స్థాయిలోనే వస్తున్నట్లు సమాచారం. ఒక సినిమాకు టీజర్ ఎంత ముఖ్యం అన్నది దీన్ని బట్టే చెప్పొచ్చు. అందుకే ఈ మధ్య అందరూ ఫస్ట్ లుక్.. టీజర్ మీద బాగా ఫోకస్ పెడుతున్నారు. ఈ విశేషాలు ఆకర్షణీయంగా ఉంటే ఆటోమేటిగ్గా హైప్ వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వీటిని తీర్చిదిద్దే పనిలో పడుతున్నారు.

సీనియర్ హీరో రాజశేఖర్ సినిమా మీద జనాల్లో ఆసక్తి తగ్గిపోయి చాలా కాలమైంది. కానీ ఆయన కొత్త సినిమా ‘పీఎస్వీ గరుడ వేగ’ మీద సడెన్ గా హైప్ క్రియేట్ అయింది. ఇందుకు కారణం ఆ చిత్ర ఫస్ట్ లుక్కే. దాన్ని అంత ప్రత్యేకంగా తీర్చిదిద్దింది ప్రవీణ్ సత్తారు అండ్ కో. ఇక సుకుమార్-రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కునున్న కొత్త సినిమా ప్రారంభోత్సవం రోజున లాంచ్ చేసిన స్కెచ్ పోస్టర్ ఎంత ఆసక్తి రేకెత్తించిందో తెలిసిందే. లేటెస్టుగా వచ్చిన నారా రోహిత్ ‘కథలో రాజకుమారి’ ఫస్ట్ లుక్ ఎంత హాట్ టాపిక్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రగ్డ్ లుక్ లోకి మారిన రోహిత్ ను చూసి అందరూ షాకైపోయారు. ఈ సినిమా గురించి డిస్కషన్లు పెట్టేశారు. మరోవైపు ‘పెళ్లిచూపులు’ ఫేమ్ విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన కొత్త సినిమా ‘అర్జున్ రెడ్డి’ టీజర్ కూడా అదిరిపోయే రేంజిలో ఉండటంతో ఈ సినిమాపైనా క్యూరియాసిటీ పెరిగింది. శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కుతున్న ‘మెంటల్ మదిలో’ కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఇంకా ఇలా రిఫ్రెషింగ్ గా ఉన్న ఫస్ట్ లుక్స్.. టీజర్స్ జనాల దృష్టిని బాగా ఆకర్షిస్తున్నాయి. ఇక అందరి ఫోకస్ ‘దువ్వాడ జగన్నాథం’ ఫస్ట్ లుక్.. ఫస్ట్ టీజర్ మీద ఉంది. మరి హరీష శంకర్-అల్లు అర్జున్ జోడీ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/